టెకీలు ఇక హాయిగా నిద్రపోవచ్చు..
బీజింగ్: సాధారణంగా బాస్లంటే ఎలా ఉంటారు. పని త్వరగా పూర్తవ్వాలని.. ముందుగా నిర్ణయించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తారు. అలా జరగలేదో వారి తీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివతాండవం తప్పదు. వాస్తవానికి ఎంతపనిచేస్తున్నా ఉద్యోగుల విషయంలో యజమానుల ఉదాసీనత కాస్తంత తక్కువగానే ఉంటుంది. కానీ, చైనాలో ఆ పరిస్థితి మారుతోంది. తమ సంస్థల్లో పనిచేసే టెక్కీల క్షేమమే తమ లక్ష్యంగా మార్పు చెందుతోంది. అందుకు ఉదాహరణగా బైషాన్ క్లౌడ్ అనే కంపెనీ నిలుస్తోంది. దాయి జియాంగ్ అనే వ్యక్తి బీజింగ్ లో ని ఓ మిషనరీ సంస్థలో పనిచేస్తున్నాడు.
ఇందులో ఒక షిప్ట్ 72 గంటలు ఉంటుంది. అంటే మూడు రోజులు. దీంతో అతడు ఎప్పుడుపడితే అప్పుడు అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడన్నమాట. పనివేళల్లో అతడు ఓ తేలికపాటి కునుకు తీసినా అతడిని బాస్ ప్రశ్నించడు. ఇలా అతడు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి గత పదిహనేళ్లుగా ఇలాగే ఉంది. దీంతో దాయి పనిచేసే సంస్థ బైషాన్ క్లౌడ్ ఇప్పుడు ఏకంగా ఓ పన్నెండు బంక్ బెడ్స్ను ఏర్పాటుచేసింది. ఆఫీసులోనే ఓ పక్కకు ఒక దానిపై ఒకటి అల్మారాల మాదిరిగా పెట్టించింది. ఈ 72గంటల షిప్టుల్లో ఉన్నవారు.. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండానే ఎప్పుడంటే అప్పుడు ఏం చక్కా అందులోకి వెళ్లి నిద్రపోవచ్చు.
ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగుల మానసిక పరిస్థితి కుదురుగా ఉంటేనే సరిగా పని చేయగలరని ఆ కంపెనీ చెబుతోంది. అమెరికాతో పోటీ పడుతున్న చైనాకు ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణం అని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రామిక నైపుణ్యం లభించే ఆ దేశంలో ఇలా పనుల్లో ఉండగా కునుకిపాట్లు ఉండనే ఉంటాయని చెప్తుంటారు. తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొన్న చైనాలో ఇప్పుడు ఉద్యోగుల కోసం ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాదు.. ఆఫీసుల్లోనే ఇంటిని తలపించే వాతావరణం కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ ఉద్యోగులు మాత్రం తమ కుటుంబాలను మిస్సవుతున్నామని ఫీలవుతున్నారు.