
ఫైల్ ఫోటో
ఢాకా: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ రక్షణ శాఖ సీనియర్ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోసీన్ చౌదరి (57) కరోనా వ్యాధితో మరణించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. అబ్దుల్లా మృతిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు.
గత నెల మే 29న అనారోగ్యంతో ఢాకాలోని మిలిటరీ ఆసుపత్రి (సీఎంహెచ్)లో చేరిన అబ్దుల్లాకు కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆయనను జూన్ 6న ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని అదనపు కార్యదర్శి ఎండీ మహమూద్ ఉల్ హక్ తెలిపారు. ఆయన మృతికి బంగ్లాదేశ్ రక్షణ శాఖ సిబ్బంది, ఇతరులు నివాళులర్పించారు. కాగా అబ్దుల్లాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.