ఇరాన్‌లోని ఆహ్వాజ్ పట్టణంలో సులేమానీకి నివాళులర్పించేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే.
దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది. సులేమానీ అనే ఉగ్రవాదిని హతమార్చినందుకు ఇరాన్ అమెరికాపై దాడులు చేస్తామని బెదిరిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్‌లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. కొన్ని గంటల తరువాత ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘వారు మాపై దాడి చేశారు. మేం ప్రతీకార దాడులు చేశాం. వారు మళ్లీ దాడి చేస్తే.. మా ప్రతీకారం మరింత తీవ్రంగా ఉంటుంది’ అని ట్రంప్ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. ‘మిలటరీ సంపత్తి కోసం ఇటీవలే 2 ట్రిలియన్(2 లక్షల కోట్ల) డాలర్లను ఖర్చు చేశాం. ప్రపంచంలోనే మాది అతిపెద్ద, అత్యంత సామర్థ్యమున్న ఆర్మీ. మా స్థావరాలపై కానీ, పౌరులపైకానీ దాడి చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతీకార దాడులుంటాయి’ అని స్పష్టం చేశారు.
యూఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ఆదివారం ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు.
ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు
తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు.
కెన్యా బేస్‌పై దాడి
కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ ఆదివారం దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రికి ఫోన్
యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు.
సులేమానీకి అశ్రు నివాళి
టెహ్రాన్: అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందిన తమ హీరో, జనరల్ ఖాసిం సులేమానీకి ఆదివారం ఇరాన్‌లో అభిమానులు భారీగా తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. నల్లని దుస్తులు ధరించి, కన్నీళ్లు పెట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ బాధను వ్యక్తపరిచారు. ‘అమెరికాకు ఇక చావే’ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాక్ నుంచి సులేమానీ మృతదేహం ఇరాన్‌లోని అహ్వాజ్ పట్టణానికి చేరింది. సులేమానీ, అతనితో పాటు మరణించిన వారి మృతదేహాలను టెహ్రాన్‌కు తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment