సోషల్ మీడియా వారిని కలిపింది..!
టొరంటోః వారి వివాహం జరిగి 62 ఏళ్ళు దాటింది. జీవిత చరమాంకంలో ఉన్న ఆ వృద్ధ దంపతులిద్దరూ బలవంతంగా వేర్వేరు నర్సింగ్ హోమ్స్ లో ఉండాల్సి రావడం వారి హృదయాలను కలచి వేసింది. కన్నీరు పెట్టించింది. ఒకరికి ఒకరై బతికిన ఆ జంట.. చివరి దశలో విడివిడిగా ఉండేందుకు తల్లడిల్లింది. ఆ సన్నివేశంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది. వారిద్దరూ కన్నీరు తుడుచుకుంటున్న ఫోటో అంతర్జాతీయంగా తీవ్రమైన సానుభూతిని పొందడమే కాక, వారిద్దరినీ తిరిగి కలిపేందుకు సహకరించింది.
వోల్ ఫ్రేం, అనితా గోట్సాక్ అనే 83, 81 ఏళ్ళ వయసున్న వృద్ధ కెనడియన్ జంట ఆగస్టు నెల్లో బలవంతంగా విడిపోవాల్సి వచ్చింది. పెళ్ళయి 62 పాటు వారి సంసార జీవితం హాయిగా గడిచిపోయింది. లింఫోమియాతో బాధపడుతున్న వోల్ ఫ్రేం కు చికిత్స అందించడంకోసం నర్సింగ్ హోం లో స్థలాభావం ఏర్పడింది. దీంతో ఆయన్నుమరో హోం కు తరలించాల్సి వచ్చింది. సుమారు ఆరు దశాబ్దాలు హాయిగా గడిచిన సంసార జీవితంలో చివరి దశలో తీవ్రమైన ఎడబాటు రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు. ఒకేచోట ఉండలేని పరిస్థితిని జీర్ణించుకోలేకపోయారు. వోల్ ఫ్రేం ను మరో హోం కు తరలిస్తున్న సమయంలో దంపతులిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. ఆ సన్నివేశంలో చిత్రించిన ఓ ఫోటోను వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫోటోద్వారా వారి కథను తెలుసుకున్న వారంతా ఎంతో సానుభూతిని చూపించారు. దీంతో ఆ ఫోటో సుమారు 3000 సార్టు రీ పోస్ట్ అయ్యింది. ఇదే వారిద్దరినీ తిరిగి కలిపేందుకు సహకరించింది.
ప్రస్తుతం వారిద్దరూ సర్రే లోని బ్రిటిష్ కొలంబియా నర్సింగ్ హోమ్ లో తిరిగి కలిసినట్లు వారి మనుమరాలు ఆర్ష్లే బార్త్యిక్ ఫేస్ బుక్ లో రాసింది. వోల్ ఫ్రేం, అనితా గోట్సాక్ కలిసి జీవించే అవకాశం రావడంతో కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. ఆ వృద్ధ జంట కూడా ఓ ప్రేమతో కూడిన స్పర్మను, ముద్దులను పంచుకుంటూ తమ కలయికను ఆనందంగా ఆస్వాదిస్తున్న వీడియోలోని సన్నివేశం అందరికీ సంతోషాన్నిచ్చింది. వారు చివరి దశలో తిరిగి ఒకేచోట జీవించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆ దంపతుల తరపున మనుమరాలు ఆర్ష్లే బార్త్యిక్ కృతజ్ఞతలు తెలిపింది. కెనడియన్ హెల్త్ కేర్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లే ఆ వృద్ధులను విడదీయాల్సి వచ్చిందంటూ బార్త్యిక్ ఆరోపించింది.