'షుగర్' గాయాలు మానాలంటే...?
న్యూయార్క్: మనకేదైనా గాయమైతే కొంచెం ఇబ్బంది. అదే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏదైనా గాయమైతే ఇక చెప్పనక్కర్లేదు ఆ అవస్థ! గోరు చుట్టుపై రోకటి పోటులా మానేవరకు మహా ఇబ్బంది పెట్టేస్తుంది. దీనిపై పరిశోధన జరిపిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ శాస్త్రవేత్త డాక్టర్ మిన్ ఝావ్ మాత్రం గాయం చుట్టూ స్వల్ప మోతాదులో కరెంటు షాక్‌లివ్వడం ద్వారా నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
మామూలు మనుషులకు గాయమైనప్పుడు ఆ పరిసరాల్లోని కణాల ద్వారా అందే ఎలక్ట్రిక్ సంకేతాల కారణంగా గాయం మానే ప్రక్రియ మొదలవుతుంది. అదే మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయంలో ఈ సంకేతాలు చాలా బలహీనంగా ఉన్నాయని మిన్ ఝావ్ గ్రహించారు. గాయం మానడానికి కృత్తిమంగా కరెంటు సంకేతాల శక్తిని పెంచితే త్వరగా నయమవుతుందని అంటున్నారు. గాయమైన చోట అయాన్లు వ్యాపించేలా మందులిస్తే ఈ కరెంటు సంకేతాలు ఎక్కువవుతాయని, లేదంటే నేరుగా కరెంటు షాక్‌లివ్వవచ్చని వివరించారు.