ఫేస్ బుక్... యూజర్లకు కొత్త సదుపాయం
ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్.. ఇప్పుడు ఖాతాదారులకు కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల అభిరుచులను సేకరిస్తున్న ఈ సామాజిక మాధ్యమం... యూజర్ల ఆసక్తికి అనుగుణంగా 'యాడ్ ప్రిఫరెన్సెస్' టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఫేస్ బుక్ పేజీలో వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్ బుక్ పేజ్ లో యూజర్లు ఎక్కువగా చూసే విషయాల ఆధారంగా సంబంధిత మాచారాన్ని సేకరించి ఆయా ప్రకటనలకు చెందిన పూర్తి సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతుంది.
సాధారణంగా ఏ వెబ్ పేజీ తెరచినా పక్కనే అనేక ప్రకటనలు కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఫేస్ బుక్ ఇప్పుడు వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది. ప్రధానంగా మీ వయసు, ఫేస్ బుక్ వినియోగించే తీరు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని.. మీరు క్లిక్ చేసిన బటన్స్ ను బట్టి మీకేం కావాలో అంచనా వేస్తుంది. సైట్ నుంచి మీరు లాగౌట్ అయిపోయినా సమాచారం మాత్రం సేకరించి ఉంచుతుంది. ముఖ్యంగా ఈ టూల్... ఫేస్ బుక్ పేజీ శీర్షిక ఆధారంగా మీక్కావలసిన అంశాన్ని గుర్తిస్తుంది.
వైవాహిక జీవితం, రాజకీయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీ ప్రాధాన్యతను అంచనా వేస్తుంది. క్లాత్, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ప్రకటనలను వాటికి సంబంధించిన ఫొటోలతో సహా పూర్తి సమాచారాన్ని మీ ముందుంచుతుంది. పేజీలో మీరు సబ్జెక్ట్ ను మార్చినప్పుడల్లా ఆయా విషయాలకు సంబంధించిన ప్రకటనలు పేజీలో మారుతుండటం ఈ 'యాడ్ ప్రిఫరెన్సెస్' ప్రత్యేకత. అంతేకాక ఈ సమయంలో కొత్త ప్రకటనలను వినియోగదారులకు పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నిస్తుంది.