ఇంటర్నెట్ ఉన్న గాడ్జెట్లతో ఇబ్బందులే...
ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరాలతో భవిష్యత్తు భయంకరంగా మారే అవకాశం ఉందంటున్నారు సైబర్ భద్రతా నిపుణులు. ఇంట్లోని గాడ్జెట్లే ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తోందని పానాసోనిక్ సైబర్ భద్రతా చీఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ ప్రతి వస్తువూ ఇంటర్నెట్ ఆధారితంగా మారుతోందని, అయితే వీటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నాణ్యతలేని పరికరాల వాడకంతో పాటు... వినియోగదారుల నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు. హ్యాకర్ ప్రూఫ్ లేని వస్తువులను కొనుగోలు చేసేముందు ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు.
నాణ్యతలేని పరికరాలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో ప్రమాదాలు తప్పవంటున్నారు జపాన్ భద్రతా నిపుణులు. ఇంటర్నెట్ కనెక్షన్ తో వాడే పరికరాలతో భవిష్యత్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పానాసోనిక్ సైబర్ భద్రతాధికారి హికో హిటోలిన్ చెప్తున్నారు. తక్కువ ఖరీదులో వెలువడే ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తోందని, అలాంటివాటిపై మోజు పెంచుకోవడం ప్రమాదాలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నారు. ఈ గాడ్జెట్లు వేడెక్కడంవల్ల ఇంట్లో మంటలు చెలరేగి ఎందరో మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయని అంటున్నారు. గృహ పరికరాల్లో ముఖ్యంగా టంబల్ డ్రయ్యర్లు ప్రమాదకరంగా ఉంటున్నాయని, గత ఆరేళ్ళలో బ్రిటన్లో సుమారు 6 వేల డ్రయ్యర్లు పేలి... మంటలు వ్యాపించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వెబ్ కనెక్షన్‌తో వెలువడే ప్రతి ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నామని, ముఖ్యంగా వేడెక్కే వస్తువులన్నింటిపైనా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటర్నెట్ ఆధారిత పరికరాల విషయంలో ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యేలా చూసుకోవాలని, హ్యాకర్ల దాడి నుంచి రక్షణ కోసం ఇది తప్పనిసరని సూచిస్తున్నారు. దాంతోపాటు ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే వినియోగదారులు కూడా తమ తమ గాడ్జెట్లకు ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్లు అప్ డేట్ చేసుకోవడం ఎంతైనా అవసరమంటున్నారు.