న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచంలో పలు దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్త కోసం చైనాతోపాటు కొన్ని దేశాల ప్రజలు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఈ మాస్క్‌లకు డిమాండ్ పెరగడంతో ‘ఆమెజాన్ ఆన్‌లైన్’ మార్కెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిల్వ ఉన్న స్టాక్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే అమ్ముడు పోయింది. ప్రపంచానికి మాస్క్‌ల సరఫరా చేస్తున్న నెంబర్ వన్ దేశం చైనానే కావడం, అక్కడే కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. సరఫరాలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మాస్క్‌లలో సగం వాటా చైనాదే కావడం గమనార్హం. (చదవండి: కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే?)
కాలుష్యంతోపాటు వివిధ రకాల వైరస్‌ల నుంచి తప్పించుకునేందుకు పలు రకాల మాస్క్‌లు అందుబాటులో ఉండడం, తమకు అందుబాటులో ఉన్న మాస్క్‌లను ప్రజలు కొనుక్కొని వాడుతుండడం మనకు తెల్సిందే. అసలు మాస్క్‌లు ఎన్ని రకాలు? ఏ మాస్క్‌లు ఎంత వరకు రక్షణ కల్పిస్తాయి? అన్న అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సర్జికల్ మాస్క్‌లు, నాన్ సర్జికల్ మాస్క్‌లు అని ప్రధానంగా రెండు రకాల మాస్క్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. రెండు రకాల్లోను ప్రతి మాస్క్ మూడు రకాలుగా ఉంటాయి. పలుచటి బట్టతో చేసిందీ ఒకటైతే, దళసరి బట్టతో మరోటి, అంతకంటే దళసరి బట్టతో మరో రకం మాస్క్‌లు ఉంటాయి. మొదటిరకం మాస్క్‌లను సైక్లిస్ట్‌లు, రెండో రకం మాస్క్‌లను ఢిల్లీ లాంటి కాలుష్య నగర వాసులు, మూడోరకం మాస్క్‌లను తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న రోగుల నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా వాడుతున్నారు. వాయు కాలుష్యాన్ని పక్కన పెడితే వైరస్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు సర్జికల్ మాస్క్‌లను మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
సర్జికల్ మాస్క్‌లంటే ఏమిటి?
ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తున్నప్పుడు వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది వాడే మాస్క్‌లను సర్జికల్ మాస్క్‌లు అంటారు. అందులో మూడు వరుసలు ఉంటాయి. ముక్కు నుంచి నోటి నుంచి కారే జలాన్ని పీల్చుకుని, బయటకు రాకుండా ఈ మూడు వరుసలు అడ్డుపడతాయి. వాస్తవానికి రోగుల నుంచి వైద్య సిబ్బంది రక్షణ కోసం ఈ సర్జికల్ మాస్క్‌లు రాలేదని, సర్జరీ సందర్భంగా వైద్య సిబ్బంది నుంచి సర్జరీకిగానీ, రోగికిగానీ ఇబ్బంది కలుగుకుండా ఉండేందుకే వీటిని రూపొందించారని ఇంగ్లండ్‌లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్శిటీ, మెడికల్ మైక్రోబయోలోజీ అధ్యాపకులు డాక్టర్ మనాల్ మొహమ్మద్ తెలియజేస్తున్నారు. (చదవండి: ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!)
ఎఫ్‌ఎఫ్‌పీ1, ఎఫ్‌ఎఫ్‌పీ 2, ఎఫ్‌ఎఫ్‌పీ 3
ఫిల్టరింగ్ ఫేస్ పీసెస్‌ను ఎఫ్‌ఎఫ్‌పీ అంటున్నారు. వీటిలో మూడు రకాలు. మొదటి రకం వైరస్ సోకకుండా అడ్డుకోదట. కానీ ధరించిన వారి నుంచి ఇతరులకు సోకకుండా కొంత అడ్డుకుంటుందని డాక్టర్ మనాల్ తెలిపారు. ఇవి అంతర్జాతీయ మార్కెట్‌లో వంద నుంచి వెయ్యి రూపాయల వరకు 20 ఉండే ప్యాక్ దొరకుతోంది. రెండోరకం వైరస్ సోకకుండా కాస్త రక్షణ కల్పిస్తోందని. మూడోరకం 99 శాతం రక్షణ కల్పిస్తుందని, మందంగా ఉండడమే అందుకు కారణమని ఆమె తెలిపారు. శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది కనుక మూడో రకం మాస్క్‌లు ధరించి పనులు చేసుకోలేమని ఆమె చెప్పారు.
ఎఫ్‌ఎఫ్‌పీ 2 మాస్క్‌లు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉన్నాయి. ఎఫ్‌ఎఫ్‌పీ 3 రకం మాస్క్‌లు రెండు నుంచి 20 వేల రూపాయల వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని ఏ రోజు మాస్క్ ఆరోజు పడేసేవి కాగా, మిగతా వాటిల్లో ఫిల్టర్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ మాస్క్‌లు నూటికి నూరు శాతం రక్షణ కల్పిస్తాయని డాక్టర్ మనాల్ తెలిపారు. అవి అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌లో 1,500 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి.
మూడోరకం మాస్క్‌లైనా సరే గాలి జొరడానికి వీల్లేకుండా మూతిని, ముక్కును బిగబట్టి ఉండాలట. అంతేకాకుండా చేతులు శుభ్రంగా లేకుండా కళ్లు తుడుచుకున్నా, మాస్క్‌లు సర్దుకున్నా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయట. కళ్ల నుంచి మన శరీరంలోకి ప్రవేశించే ఫ్లూ వైరస్‌లను మాత్రం ఈ మాస్క్‌లు ఏవీ అడ్డుకోలేవని డాక్టర్ మనాల్ చెప్పారు. అప్పుడు కళ్లు మూసుకొని పడుకోవడం ఒక్కటే మార్గమేమో! (చదవండి: కన్నా... నీ రాక కోసం!)
Comments
Please login to add a commentAdd a comment