పాయింట్ బ్లాంక్లో ఏకే 47 పేలలేదెందుకో?
పారిస్: నవంబర్ 13న పారిస్ నగరమంతా ఒక్కసారిగా అట్టుడికింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులు, రహదారులు, నివాసాలు, హోటళ్లు ఇలా ప్రతి ఒక్కటి క్షణాల్లో భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. ఒక్కసారిగా ముష్కరుల తుపాకీ చప్పుళ్లు హోరెత్తించాయి. దఫాల వారిగా దాడులు చేస్తూ దాదాపు ఆ రోజంతా కాల్పులు జరిపి 129మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. అదే సమయంలో ఓ ఆసక్తి కరమైన ఘటన చోటుచేసుకుంది.
ఓ కేఫ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినదాని ప్రకారం ఓ మహిళ ఓ ఉగ్రవాది భారి నుంచి బయటపడింది. అదృష్టమంటే అదేనేమో.. తొలుత ఆ కేఫ్ పై ఎంతో వేగంగా కాల్పులు జరిపిన ఉగ్రవాది తాను రెండడుగులు వేస్తే దొరికిపోయేంత దూరంలో ఓ మహిళ ఉండటం గమనించి ఆమె దగ్గరికి వాయువేగంతో వెళ్లి అతడి చేతిలోని ఏకే 47 గన్ ను ఆ మహిళ తలకు గురిపెట్టాడు. కానీ ట్రిగ్గర్ నొక్కినా అది పేలలేదు. స్ట్రక్ అయిపోవడంతో అతడు రెండు మూడు సెకన్లు మాత్రమే మరోసారి నొక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతబట్టుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఆ కేఫ్ లో తలదాచుకున్న ఇద్దరు దంపతులు కూడా బతికిబట్టకట్టారు.