
ప్యాంగ్‌యాంగ్‌లోని ఎయిర్‌పోర్టులో అభివాదం చేస్తున్న దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్, ఉత్తరకొరియా అధినేత కిమ్
సియోల్: చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉ.కొరియాకు వెళ్లారు. ప్యాంగ్‌యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అధ్యక్షుడు కిమ్–జొంగ్–ఉన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనానికి బయలుదేరారు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి దారిపొడవునా వందలాది మంది ప్రజలు స్వాగతం పలికారు.
అనంతరం అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ‘ప్రపంచం మొత్తం మమ్మల్ని గమనిస్తోంది. ప్రపంచ ప్రజలకు శాంతి, సంపదను సాధించడమనే బృహత్తర బాధ్యత నాపై ఉంది’ అనంతరం మూన్ మీడియాతో అన్నారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. సంపూర్ణ అణునిరాయుధీకరణ జరగాలని అమెరికా పట్టుబడుతుండగా, తమ దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర కొరియా కోరుతోంది. గత పదేళ్లలో ద.కొరియా అధ్యక్షుడొకరు ఉ.కొరియాలో పర్యటించడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment