90 ఏళ్ల డాక్టర్...67 ఏళ్ల ప్రాక్టీస్..
వయసు పైబడే కొద్దీ శరీర బలహీనతలు ఆవహించి చాలామంది ఇంటికి పరిమితమవుతారు. కొంతమంది అయితే కాస్త దూరం నడవాలన్నా చాలా ఆయాసపడతారు. అలాంటి వాళ్లందరికీ రష్యాలోని మాస్కోలో ఉన్న అల్లా ఇల్లించినా ఒక ఆదర్శం. ఎందుకంటే ఆమె వయసు ప్రస్తుతం దాదాపు 90 ఏళ్లకు చేరుకుంది. ఆ పెద్దావిడ ప్రస్తుతం మాస్కోలోని ఒక హాస్పిటల్‌లో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పాకులాడే ఈ వయసులో ఆమె రోజుకు నాలుగు ఆపరేషన్లు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తోంది. 67 ఏళ్లుగా దాదాపు పది వేలకు పైగా శస్త్రచికిత్సలు చేసింది.
డాక్టర్ అనేది వృత్తి కాదని.. అది ఒక జీవిత విధానమని చెప్పే అల్లా.. వృద్ధాప్యం మీద పడినప్పటికీ అలసిపోకుండా పనిచేస్తూ అంధుడైన తన మేనల్లుడితోపాటు 8 పిల్లులను సైతం పోషిస్తోంది. తన రిటైర్‌మెంట్ గురించి ప్రశ్నించిన ఒక ఎఫ్‌ఎం స్టేషన్ వారితో తాను రిటైర్ అయితే ఆపరేషన్లు ఎవరు చేస్తారు? అంటూ చమత్కరించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ సర్జన్‌గా తనను తాను ఆమె అభివర్ణించుకున్నారు. అన్ని రకాల ఆహారపదార్థాలు తినడం, ఎక్కువగా నవ్వడం, ఏడ్వడమే తన ఆరోగ్య రహస్యమని అల్లా బోసినవ్వులు చిందిస్తూ మురిసిపోయింది.