సూట్కేసులో దాక్కొని దొరికిపోయాడు..
బెర్న్: యూరప్ వలస బాధితుల ఉదంతాలకు అద్దం పట్టే ఘటన స్విజర్లాండ్లో చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి రైల్లో అక్రమంగా స్విజర్లాండ్లోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి సూట్కేసులో దాక్కున్నాడు. ఆరడుగుల ఎత్తున్న వ్యక్తి.. చిన్న సూట్కేసులో నక్కి మిత్రుడితో పాటు ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
సూట్కేసులో దాక్కొని సుమారు 45 నిమిషాలు ప్రయాణించిన తరువాత కలిగిన అసౌకర్యం మూలంగా ఆ వ్యక్తి శబ్దం చేయటంతో తోటి ప్రయాణికులకు అనుమానం కలిగింది. వారు సూట్కేసు నుంచి శబ్దాలు వస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫాంపై దానిని ఓపెన్ చేసిన పోలీసులు అందులో ఓ వ్యక్తి ఉండటం చూసి షాక్ తిన్నారు. సదరు వ్యక్తితో పాటు.. మిత్రుడి వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించిన పోలీసులు వారిని తిరిగి వెనక్కి పంపారు. వీరు ఎరిత్రియాకు చెందినవారిగా గుర్తించారు. వలసలు వెళ్లే క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను అన్వేషిస్తూ కొందరు మృత్యువాత పడుతున్నారు.