
శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తలు, వదంతులను అరికట్టేందుకు తమకు మరికొంత సమయం అవసరమని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. దాదాపు 8.7 కోట్ల మంది అమెరికన్ల ఫేస్‌బుక్ వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా తస్కరించిన వ్యవహారంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన ఆయన కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ శుక్రవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తిచేస్తున్న పేజీలను 2017 నుంచి తొలగిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ 2019 వరకూ కొనసాగినా ఇలాంటి అకౌంట్లను పూర్తిస్థాయిలో తొలగించలేమని వెల్లడించారు.
ఈ వదంతులు, నకిలీ వార్తల పేజీలను తొలగించేందుకు తమకు మరికొంత సమయం అవసరమవుతుందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక దేశపు ఎన్నికలను మరో దేశం ప్రభావితం చేయకుండా, యూజర్ల సమాచారంపై వారికి మరింత అధికారం ఉండేలా, విద్వేష వ్యాఖ్యలు, దూషణల నుంచి ప్రజలను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా యూజర్ల గోప్యత, ఎన్‌క్రిప్షన్, భవిష్యత్ వ్యాపార ప్రణాళికలు, యూజర్ల సమాచార నిర్వహణ, ఎన్నికల్లో ఫేస్‌బుక్ దుర్వినియోగం కాకుండా తీసుకున్న చర్యలు సహా పలు అంశాలపై సవివరణ నివేదిక ఇస్తానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఏర్పాటైన యూఎస్ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఈ నెల 5న చేపట్టిన విచారణకు ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీలు హాజరైన సంగతి తెలిసిందే.