‘కొత్త దేశాలను చేర్చే ఉద్దేశం ఇప్పటికైతే లేదు’
వాషింగ్టన్: మరిన్ని దేశాలపై అమెరికా ట్రావెలింగ్ బ్యాన్ విధించే ఉద్దేశం ఇప్పట్లో లేదని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న దేశాల జాబితాలో ఒక్క దేశాన్ని కూడా అదనం చేర్చడంగానీ, తీసివేయడం జరగదని బుధవారం శ్వేతసౌదం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇప్పటికిప్పుడు కొత్త దేశాలను ట్రావెలింగ్ నిషేధిత దేశాల జాబితాలో చేర్చే ఉద్దేశం, ఆలోచన లేదు’ అని శ్వేత సౌదం మీడియా ప్రతినిధి సియాన్ స్పైసర్ బుధవారం చెప్పారు.
ప్రస్తుతం ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాల అంశాలపైనే కొత్త పరిపాలన వర్గం దృష్టిని సారించిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిపారు. అయితే, దీనిపై తుది నిర్ణయానికి రాలేదని సమీక్ష పూర్తయ్యాక వివరాలు అందిస్తామని తెలిపారు.