
పాకిస్తాన్ భారీకాయుడు నూర్ హస్సన్‌ను చికిత్స నిమిత్తం లాహోర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ రెస్క్యూ టీంల సహకారంతో నూర్ హస్సన్‌ను పంజాబ్‌లోని సదిక్వాబాద్ నుంచి మిలిటరీ హెలికాప్టర్‌లో లాహోర్‌కు తరలించారు. అతని తరలింపు, చికిత్స కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థూలకాయుడు హస్సన్ 330 కిలోల బరువుండి కదలడానికి కూడా వీలు లేని స్థితిలో ఉన్నాడు. దీంతోపాటు బరువు కారణంగా వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలు అతన్ని బాధిస్తున్నాయి. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం లాపొరోస్కోపీ సర్జరీ చేయించుకోనున్నాడు.
అతన్ని చికిత్సకు తరలించడానికి రెస్క్యూ టీం నానాకష్టాలు పడింది. అతని శరీరం పెద్దదిగా ఉండి ఇంటి ప్రధాన ద్వారంలో పట్టకపోవడంతో ఇంటి గోడను కూల్చి బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహోర్‌కు తరలించారు. పాకిస్తాన్ మీడియా నూర్ హస్సన్‌ను ఆ దేశంలోనే అతి భారీకాయుడిగా వర్ణిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం తెలియరాలేదు. 2017లో 360 కిలోల బరువున్న ఊబకాయుడు కూడా లాపొరోస్కోపీ సర్జరీ ద్వారా 200 కిలోలకు తగ్గాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే నూర్ హస్సన్ ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో 29 శాతంమంది అధిక బరువుతో బాధపడుతుండగా అందులో 51 శాతం ఊబకాయుల లిస్టులో ఉన్నారు.

Comments
Please login to add a commentAdd a comment