ఫొటోలు తీస్తుంది.. పోత పోస్తుంది!
మీ నిలువెత్తు రూపాన్ని పోత పోయించుకోవాలని ఉందా? మీ కుటుంబం మొత్తాన్ని సిరామిక్ ప్రతిమల్లో చూసుకోవాలనుకుంటున్నారా? బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఏఎస్‌డీఏ స్టోర్‌కు వెళితే మీ కల నిజమవుతుంది. ప్రపంచంలోనే తొలి హైస్పీడ్ బాడీ స్కానర్, త్రీడీ ప్రింటర్‌తో ఇలాంటి విగ్రహాలు రూపుదిద్దుకుంటాయి. ఏఎస్‌డీఏ స్టోర్‌లో ఏర్పాటుచేసిన ఫొటోబూత్‌లోని త్రీడీ హైస్పీడ్ బాడీ స్కానర్లు మనల్ని అన్ని కోణాల్లోనూ ఫొటోలు తీస్తాయి. కచ్చితమైన కొలతలను తీసుకుంటాయి.
ఆ ఫొటోలన్నింతో త్రీడీ ఇమేజ్‌ను సృష్టిస్తుంది. అనంతరం ‘మినీ-మీ ప్రొడక్షన్ ప్లాంట్’లో త్రీడీ ప్రింటర్లు సిరామిక్ మెటీరియల్‌ను ఉపయోగించి ప్రతిమను రూపొందిస్తాయి. ఈ ఫొటోలోని హాడ్జికిన్సన్ కుటుంబం తమ ప్రతిమలను ఇలా ప్రింట్ చేయించుకుంది. ఒక్కో సిరామిక్ విగ్రహానికి 60 పౌండ్లు (రూ.6,100) చెల్లించాల్సి ఉంటుంది.