ఫ్రిజ్ మంటలే కారణం
లండన్ భవన అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల ప్రకటన
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లోని గ్రెన్‌ఫెల్ టవర్‌లో జూన్ 14న సంభవించిన అగ్ని ప్రమాదానికి ఓ ఫ్రిజ్ నుంచి వచ్చిన మంటలే కారణమని దర్యాప్తు అధికారులు శనివారం ప్రకటించారు. 24 అంతస్తుల గ్రెన్‌ఫెల్ టవర్‌లో అగ్నిప్రమాదం సంభవించి 79 మంది మృత్యువాత పడటం తెలిసిందే. భవనంలోని కింది అంతస్తులో రిఫ్రిజిరేటర్ నుంచి మంటలు వచ్చాయనీ, బిల్డింగ్ బయటి గోడలకు వేసిన తొడుగుకు మండే స్వభావం ఉండటం వల్లే కొద్దిసేపటికే అగ్ని కీలలు ఎగసిపడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. తొడుగును ప్రయోగశాలలో పరీక్షించగా, కొద్ది సేపటికే అది కాలిపోయినట్లు అధికారులు చెప్పారు.
ప్రమాదకర భవనాల నుంచి తరలింపు
అగ్నిమాపక భద్రతా ప్రమాణాల పరీక్షల్లో విఫలమైన భవనాల నుంచి వేలాది మంది ప్రజలను బ్రిటన్ అధికారులు ఖాళీ చేయించారు. 27 భవనాల్లో భద్రతా ప్రమాణాలు సరిగా లేవని పరిశీలనలో తేలగా, స్విస్ కాటేజీ ప్రాంతంలోని నాలుగు భవనాల నుంచి ప్రజ లను శుక్రవారం రాత్రి ఖాళీ చేయించారు.