ఈ తెరచాప ఎత్తితే.. కరెంటు వస్తుంది!
పడవలకు తెరచాపను ఎందుకు వాడతారు? గాలివాటాన్ని ఉపయోగించుకుని పడవను సరైన దిశలో ముందుకు తీసుకుపోవడానికి. అయితే ఈ తెరచాపతో పడవను నడపడమే కాదు.. కరెంటునూ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాగంటే.. దీనిలో సోలార్ సెల్స్ కూడా ఉంటాయి మరి. అధునాతనమైన ఈ పర్యావరణ హిత నౌకను డాక్టర్ మార్గట్ క్రసోజెవిక్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. కార్బన్ ఫైబర్, కృత్రిమ ఫైబర్‌తో తయారు చేసిన తెరచాపలో సోలార్ సెల్స్‌ను పొందుపరుస్తారు. అవసరమైనప్పుడు పడవ నీటిపై కొంత ఎత్తుకు తేలేందుకు, తెరచాప దిశను, ఆకారాన్ని మార్చుకునేందుకు కూడా వీలవుతుంది. పూర్తిగా సౌరవిద్యుత్‌తోనే నడిచే ఈ పడవను దక్షిణాఫ్రికాలోని హోల్డెన్ మాంజ్ వైన్ ఎస్టేట్ యజమానులు డిజైన్ చేయించుకున్నారు. పడవ పందేలకు, సముద్రయానానికి దీనిని ఉపయోగిస్తారట. వచ్చే ఏప్రిల్‌లో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని నిర్మాణానికి రూ. 10 కోట్ల వరకూ ఖర్చు కానుందట.