
సాక్షి,న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ), రోబోటిక్స్‌తో ఉద్యోగాలు ఊడటమే కాదు మానవ ఉనికికే ప్రమాదమని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. గ్రహాంతరవాసులతో ప్రమాదం పొంచి ఉందని గతంలో హెచ్చరించిన హాకింగ్ తాజాగా రోబోలు మానవులను పూర్తిగా ఆక్రమించేస్తాయని కృత్రిమ మేథతో పెనుముప్పు ఎదురవనుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జాతిని మొత్తంగా కబళిస్తుందనే భయం తనకుందని హాకింగ్ పేర్కొన్నట్టు మిర్రర్ కథనం పేర్కొంది.
కంప్యూటర్ వైరస్‌లను కొందరు క్రియేట్ చేస్తే వాటికి దీటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తుందని, ఇది విధ్వంసానికి దారితీస్తుందని హాకింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.మానవుల పాత్రను పరిమితం చేసే నూతన విధానం ఇదని ఆయన అభివర్ణించారు. మానవ మెదడు, కంప్యూటర్ సాధించే విషయాల్లో వైరుధ్యం ఉందని తాననుకోవడం లేదని వైర్డ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూ‍్యలో ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ జనాభా ఆందోళనకరంగా పెరిగిపోతోందని..మనం స్వయం విధ్వంసం దిశగా వెళుతున్నామని హెచ్చరించారు.మానవ జాతిని పరిరక్షించుకునేందుకు మనం ఇతర గ్రహాలను అన్వేషించాల్సి ఉందని అన్నారు. రాబోయే వందేళ్లలో మానవులు భూమిని వదిలి వేరే గ్రహాలకు వెళ్లాలని గతంలో హాకింగ్ పేర్కొన్న విషయం విదితమే. ప్రపంచ ప్రభుత్వం మానవాళికి ఉన్న ఏకైక ఆశాజ్యోతి అని ఆయన స్పష్టం చేశారు.