
ఆపరేషన్ చేస్తుండగా నగ్నంగా చూశాడని..
రియాద్: సౌదీలో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడిన డాక్టర్ పై కాల్పులు జరిపాడో వ్యక్తి. దైవంతో సమానంగా చూసే వైద్య వృత్తిలో కూడా చెడునే వెతుక్కున్నాడు ఆ వ్యక్తి.
వివరాలు.. ఓ మహిళ పురిటి నొప్పులతో సౌదీలోని రియాద్లో కింగ్ ఫహాద్ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేయాల్సిందిగా ఆమె భర్తతో డాక్టర్లు తెలిపారు. మహిళా డాక్టర్లతోనే ఆపరేషన్ చేపించాలని ఆ వ్యక్తి కోరాడు. అయితే అందుబాటులో మహిళా డాక్టర్లు లేకపోవడం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావడంతో డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ ఆ మహిళకు ఆపరేషన్ చేశాడు.
అయితే ఆపరేషన్ ఓ పురుష డాక్టర్ చేయడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యను నగ్నంగా మరో పురుషుడు చూశాడని ఆగ్రహావేశాలకు గురయ్యాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కూడా తన కోపాన్ని వెళ్లగక్కాడు. అంతేకాకుండా ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ పై కసిని పెంచుకున్నాడు. ఆపరేషన్ అనంతరం డాక్టర్తో సరదాగా మాట్లాడినట్టు నటించాడు. తల్లి, బిడ్డలను ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఉండేలా ఆపరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి కలవాలని కోరాడు.
ఆసుపత్రి ప్రాంగణంలో కలవడానికి వచ్చిన డాక్టర్ పై తనతోపాటు తీసుకువచ్చిన గన్ తో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. సౌదీ పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. కాగా కాల్పుల్లో గాయపడిన డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతనికి ఎంలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.