
పఠాన్ కోట్ ఘటనపై పాక్ లో ఉన్నతస్థాయి భేటీ
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయాలని అధికారులను పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశించారు. గురువారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి ఘటనపై సమావేశంలో చర్చించారు. భారత్ అందజేసిన ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను నవాజ్ షరీఫ్ ఆదేశించారు.
జాతీయ, స్థానిక భద్రతకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి, ఆంతరంగిక వ్యవహారాల మంత్రి, విదేశాంగ సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, నిఘా విభాగం ప్రధానాధికారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ అందించిన ఆధారాలతో పఠాన్ కోట్ దాడిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
అయితే భారత్ అందజేసిన సమాచారం సరిపోదని, మరిన్ని ఆధారాలు కోరాలని ఓ అధికారి పేర్కొన్నట్టు తెలిపాయి. గట్టి ఆధారాలుంటే దోషులపై కేసులు పెట్టొచ్చని, లేకుంటే కోర్టులు జోక్యం చేసుకుని అనుమానితులను విడుదల చేసే అవకాశముందని అభిప్రాయపడినట్టు వెల్లడించాయి. పఠాన్ కోట్ దాడి కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అంగీకారానికి వచ్చారు. దాడికి పాల్పడినవారిని చట్టం ముందు నిలబెడతామని భారత ప్రధాని నరేంద్ర మోదీకి హామీయిచ్చిన నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.