'ఇంటర్నెట్ వాడకం ఉగ్రవాదులకే బాగా తెలుసు'
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయాలని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ అన్నారు. సోషల్ మీడియాను ఎరగా వాడి యువకులను ఐఎస్ ఊబిలోకి లాగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనల్ని, మన దేశాన్ని నాశనం చేయాలనుకునే మిలిటెంట్లు ఇంటర్నెట్ వాడుతారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఓ డిబెట్ కార్యక్రమానికి హారైన ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇంటర్నెట్ మాధ్యమంగా వాడి ఐఎస్ గ్రూపులోకి చాలా మందిని రప్పించుకుందన్నారు. సామాన్య పౌరుల కంటే కూడా ఇస్లామిక్ మిలిటెంట్లు ఇంటర్నెట్ సేవల్ని బాగా వినియోగించుకుంటారని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ మేధావులు ఎలాగైనా శ్రమించి ఉగ్రసంస్థలు తమ సమాచారాన్ని కనిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు.
టెక్నాలజీని వాడి ఐఎస్ఎస్ గ్రూపు ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది, వారు ఎటువంటి చర్యలకు పాల్పడనున్నారో అలాంటి విషయాలను మీరు ముందుగానే గుర్తించాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అయితే, రిపబ్లికన్ పార్టీకే చెందిన మరో అభ్యర్థి, ఓహియో గవర్నర్ జాన్ కసిక్ ఈ విషయాలను ఖండించారు. ఇంటర్నెట్ను తొలగించాలనుకోవడం మంచి నిర్ణయమా అని ప్రశ్నించారు. ఇంటర్నెట్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలను గమనిస్తే ఆయన సీరియస్ అభ్యర్థి కాదని సెనెటర్ రాండ్ పాల్ అభిప్రాయపడ్డారు. తనపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో.. ఐఎస్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాక్, సిరియాలలో మాత్రమే ఇంటర్నెట్ సేవలు నిషేధించాలని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు ట్రంప్ స్పష్టంచేశారు.