తాజాదనానికి 'సిల్క్' కోటింగ్!
వాషింగ్టన్ః పక్వానికి వచ్చిన కాయలు త్వరగా పండటానికి, పండ్లు మంచి రంగులో కనిపించడానికి వ్యాపారులు అనేక రసాయనాల వినియోగానికి పాల్పడుతుంటారు. అయితే అటువంటి రసాయనాల వల్ల శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాల్షియం కార్బైట్ వంటి రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే పండ్లపై సిల్క్ కోటింగ్ వేస్తే ఫ్రీజర్ తో అవసరం లేకుండా వారం రోజులపాటు తాజాగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. పండ్లపై కనిపించకుండా ఉండే బయో కంపాటిబుల్ సొల్యూషన్ పూస్తే, మృదువుగా ఉండే పండ్లు రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాల్సిన అవసరం ఉండదని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు.
సహజంగా తయారయ్యే సిల్క్ ద్రావణాన్ని వినియోగించి పండ్లను తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. నీటి ఆధార ప్రక్రియతో సున్నితంగా ఉండే పండ్లను భద్రపరచుకోవడం, ఫ్రీజర్ వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గమంటున్నారు. స్ఫటికరూపంలో ఉండే ఫైబ్రాయిన్ ప్రోటీన్ కలిగిన సిల్క్... ఇతర పదార్థాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. స్ట్రాబరీలపై వేసే సిల్క్ కోటింగ్ 27 నుంచి, 35 మైక్రాన్ల మందం ఉంటుందని, ఈ ప్రకియ అనంతరం స్ట్రాబరీలను సాధారణ గది ఉష్ణోగ్రతలో భ్రదపరచుకోవచ్చని చెప్తున్నారు. పూత వేసిన పండ్లను, వేయని వాటిని విడివిడిగా భద్రపరచి పరిశీలించారు. బీటా షీట్ సిల్క్ కోటింగ్ వేసిన పండ్లు సాధారణంగా నిల్వ ఉంచిన పండ్లకంటే తాజాగా, రసంతో ఉన్నట్లు గమనించారు.
ఎడిబుల్ సిల్క్ ఫైబ్రాయిన్ కలిగిన బేటా షీట్ కోటింగ్ వల్ల పండ్లలో ఆక్సిజన్ తగ్గిపోకుండా ఉండి తాజాదనాన్ని మరింతకాలం పెంచుతుందని టఫ్ట్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఫియోరెంజో తెలిపారు. ఇదే పద్ధతిని అరటిపండ్ల పై కూడ ప్రయోగించి చూశామని, సిల్క్ కోటింగ్ వేసిన పండ్లపై తొక్కలు ఎక్కువకాలం తాజాగా, మృదువుగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. అయితే ఈ సిల్క్ పూత వల్ల పండ్ల ఆకారంలో ఎటువంటి మార్పులు రావని, అయితే పూత వేసిన అనంతరం రుచిలో తేడాలపై ఎటువంటి అధ్యయనాలు నిర్వహించలేదని పరిశోధకులు వివరించారు. సిల్క్ పూత పండ్లను సహజ పద్ధతిలో నిల్వ చేసేందుకుకే కాక, రసాయనాలతో పని లేకుండా ఎగుమతులకు కూడ ఉపయోగంగా ఉంటుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు బెనెడెట్టో మారెల్లీ తెలిపారు. ఈ తాజా అధ్యయనాల వివరాలను జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో నివేదించారు.