ఫ్లైట్ విండోస్ ఎందుకు ఓపెన్ చేయాలో తెలుసా?
న్యూయార్క్: సాధారణంగా విమానంలో ప్రయాణమంటే అందరికీ హుషారే. ప్రారంభంలో కొంచెం భయంగా అనిపించినా ప్రయాణం ఊపందుకున్నాక ఏం చక్కా గాల్లో తేలిపోతుంటారు. ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఫీలయిపోతుంటారు. కాసేపట్లోనే చిన్నపాటి నిద్రలోకి జారుకుని ఎన్నో అందమైన కలలు కంటుంటారు. అయితే, మీ కలలను, స్వల్ప నిద్రను భగ్నం చేస్తూ మరికొద్ది సేపట్లో కిందికి దిగబోతున్నాం.. అంతా మీ కిటికీలను ఓపెన్ చేసుకోవచ్చు అని చెబుతుంటారు.
అబ్బా అని మీకు చెర్రెత్తిపోతుంది. అయితే ఈ చిరాకు పడటానికి కూడా ఒక కారణం ఉంది. విమానం దిగిపోయే సమయంలో అలా ఎందుకు విండోస్ ఓపెన్ చేయాలని చెప్తారంటే 'ఒక వేళ అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే.. విమానం వెలుపల పరిస్థితులు ఏమిటో ఈ విండో బయట నుంచి చూడొచ్చు. ఒక వేళ అక్కడ శిథిలాలు, అగ్ని కీలలు, నీళ్లు ఉంటే మనం ఇక ఇతర జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే కిటికీలను కమ్మేసేంత పరిస్థితుల్లో ఇవి ఉంటే ముఖ్య ద్వారం గుండా కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని చెప్పే అవకాశం కలుగుతుంది.
వాస్తవానికి ఇదంతా కూడా చాలా చిన్న అంశంగా కనిపించవచ్చేమోగానీ.. అలాంటి అత్యవసర సమయాల్లో ప్రతి సెకను లెక్కించుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రమాదం చోటుచేసుకునేందుకు 90 సెకన్లలోపు తేరుకుంటే దీనిని నుంచి బయటపడొచ్చు. అందుకే కిటికీలు తెరవాలని చెప్తారని నిపుణులు చెప్తున్నారు.