అక్కడ విందుభోజనం 13.4 కోట్లు..!!
సింగపూర్ః ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా... ఎంతమంది అతిథులను పిలిచి విందు భోజనం పెట్టినా కోటి రూపాయలకు మించి ఖర్చు కాదేమో... కానీ సింగపూర్ లోని ఓ రెస్టరెంట్ లో విందు భోజనం ఖరీదు సుమారు 13.4 కోట్ల రూపాయలు అంటే నమ్ముతారా? ఇంతకూ ఆ భోజనానికి అంత ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
సింగపూర్ లోని ' సె లా వీ' హోటల్లో కాలు పెట్టాలంటేనే కోటీశ్వరుడయ్యుండాలి. అత్యంత సంపన్నులకోసం ఏర్పాటు చేసిన ఆ రెస్టరెంట్ లో సింగపూర్ లోని మరీనా బే శాండ్స్.. రష్యన్ వరల్డ్ ఆఫ్ డైమండ్స్ సంయుక్తంగా ప్రత్యేక విందును ఏర్పాటు చేశాయి. ఇద్దరు లక్కీ కపుల్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందు భోజనం ఖరీదు 13.4 కోట్ల రూపాయలు. అయితే ఎంతటి ఖరీదైన ఆహార పదార్థాలను పెట్టినా అంతటి ఖర్చు ఉండదు కదా! అందుకే అక్కడ విందు చేయాలనుకునేవారికి ' సె లా వీ' కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎనిమిది గంటలపాటు రెస్టరెంట్లో గడిపే అవకాశంతోపాటు.. భోజనానికి టికెట్ బుక్ చేసుకున్నవారికి ముందుగా 45 నిమిషాలపాటు హెలికాప్టర్ లో సింగపూర్ అందాలను చూపించే ఏర్పాటు చేసింది. అనంతరం రోల్స్ రాయిస్ కారులో మరీనా బే శాండ్ హోటల్ రూఫ్ పైన ఉండే ' సె లా వీ' రెస్టరెంట్ కు తీసుకెడతారు. సుమారు 10,000 తాజా గులాబీలతో చేసిన అలంకరణ వచ్చిన అతిథులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది.
'సె లా వీ' కి చేరిన అథిదులిద్దరూ సింగపూర్ సిటీ అందాలను తిలకించేందుకు వీలుగా బాల్కనీలో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ విందులో కూడా అత్యంత ఖరీదైన 18 రకాల వంటకాలను వడ్డిస్తారు. వాటిని తినేందుకు వచ్చిన వారి పేర్లతో వజ్రాలు పొదిగిన చాప్ స్టిక్ లను, 40-50 సంవత్సరాలనాటి ఓల్డ్ వింటేజ్ వైన్ సర్వ్ చేస్తారు. విందు భోజనం ఆస్వాదించిన ఇద్దరికీ ప్రపంచంలోనే అరుదైన వజ్రాలతో తయారు చేసిన 2.08 క్యారెట్ డైమండ్ ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తారు. అయితే ఈ వజ్రం ఖరీదు సుమారు 13 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, సంపన్నమైన విందు అనుభవం అని, 'డైమండ్ ఇన్ ద స్కై' అన్నట్లు సంపన్నులకు ' సె లా వీ' ఆకాశం లోని నక్షత్రంలాంటిదని వరల్డ్ ఆఫ్ డైమండ్ గ్రూప్ డైరెక్టర్ కరన్ తిలానీ చెప్తున్నారు. అయితే ఈ విందు కేవలం ఎంపిక చేసిన ఇద్దరికి మాత్రమే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ ఇద్దర్నీ ఎంపిక చేసే విషయంలో మాత్రం సదరు వజ్రాల వ్యాపారులు చాలా కండిషన్లే పెట్టినట్లు తెలుస్తోంది.