పబ్లిక్ లోనూ మహిళలను వదలడం లేదు..!
న్యూఢిల్లీ: భారతదేశం... భిన్న సంస్కృతులు, మతాలు, ఆచారాలకు కేంద్ర బిందువుగా పేరు గాంచింది. ప్రస్తుతం ఎన్నో మార్పులొస్తున్నాయి. స్త్రీలకు అత్యంత గౌరవమిచ్చే ఉన్నత దేశంగానూ భారత్ చరిత్రలోకెక్కింది. కానీ, ఆధునిక భారతంలో మహిళలు, బాలికలు, యువతులకు రక్షణ కరువైందట. ఈ విషయాన్ని ఓ సర్వే వెల్లడించింది. అలాగని ఆ సర్వే చేసింది మనవాళ్లు కాదు.. యూకేకు చెందిన ఓ సంస్థ మహిళకు రక్షణ ఉన్న నగరాలు, ప్రాంతాలపై అవగాహనా కోసం చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
యూకే, థాయ్ లాండ్, బ్రెజిల్, భారత్ దేశాలలో 16 ఏళ్లకుపైగా ఉన్న వారిని ప్రశ్నించి, వారితో చర్చించి సర్వే నిర్వహించారు. ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు గృహహింస, ఇతరత్రా వేధింపులకు గురవుతున్నారు. భారత్ లో 79 శాతం మహిళలు తరచూ ఏదో ఓ రకమైన హింస భారిన పడుతున్నారని, అందులో 25-35 ఏళ్ల మధ్య ఉన్నవారు 84 శాతం బాధితులుగా మిగులుతున్నారని సర్వే తేల్చింది. బ్రెజిల్ లో 89 శాతం, థాయ్ లాండ్ లో 86 శాతం, యూకేలో 75 శాతం మంది తరచూ ఇక్కట్లకు గురవుతున్నారు.
మిగిలిన మూడు దేశాల పరిస్థితి ఎలాగున్నా భారత్ మాత్రం వాటికంటే కాస్త భిన్నమైనది. ఒకప్పుడు భారత్ ఏ గుర్తింపు వల్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించిందో, గౌరవాన్ని పొందిందో నేడు ఆ విషయంలో దిగజారి పోతోంది. బ్రెజిల్ 41 శాతం, థాయ్ లాండ్ లో 44 శాతం, యూకేలో 23 శాతం మహిళలపై బహిరంగ ప్రదేశాలలోనే దారుణాలు జరుగుతుండగా, భారత్ లో 39 శాతం మహిళలపై ఇదే తరహాలో అఘాయిత్యాలు జరిగాయని సర్వే నిగ్గు తేల్చింది. పనిచేసే ప్రాంతాల్లోనూ వారి హక్కులు కాలరాస్తున్నారని, మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుందని వెల్లడైంది.