గ్రీన్‌కార్డుకు ఇంటర్వ్యూ తప్పనిసరి
► భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాక్
► ఆర్‌ఎఫ్‌ఈల పేరిట హెచ్–1బీ దరఖాస్తులపై పెరిగిన నిఘా
న్యూయార్క్: గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాకిచ్చింది. హెచ్–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తూ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాసం)పొందాలనుకునే వారికి అక్టోబర్ 1 నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్‌సీఐఎస్) ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేసింది. ఇప్పటికే లక్షల గ్రీన్‌కార్డుల దరఖాస్తులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా తాజా నిర్ణయంతో మరిన్ని చిక్కులు రావచ్చు. ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేస్తూ గ్రీన్‌కార్డు నిబంధనల్లో మార్పులపై ఆగస్టు 28న యూఎస్‌సీఐఎస్ ప్రకటన విడుదల చేసింది.
హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు రిక్వెస్ట్స్ ఫర్ ఎవిడెన్స్(ఆర్‌ఎఫ్‌ఈ)లు సమర్పించాలని ఇమిగ్రేషన్ అటార్నీలకు లేఖలు పెరుగుతున్నాయి. హెచ్–1బీ వీసాకు లెవల్–1 వేతనాలు అంగీకరించబోమని యూఎస్‌సీఐఎస్ తేల్చిచెప్పింది. 2017 ఏప్రిల్‌లో చేసిన హెచ్–1బీ వీసా దరఖాస్తులు అక్టోబర్, 1 2017 నుంచి చెల్లుబాటు కానున్న నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌ఈలు సమర్పించాల్సి ఉంది. గ్రీన్‌కార్డుల కోసం చేసిన మార్పులపై ఎన్‌పీజెడ్ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ డేవిడ్ హెచ్ నచ్‌మన్ మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులు, పౌరసత్వ ప్రక్రియ కోసం ఇంటర్వ్యూలు తప్పనిసరి.
నిజానికి ఉద్యోగ వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారాలంటే ఇంటర్వ్యూలు నిర్వహించడం దశాబ్దకాలంగా అమల్లోఉంది. ఇంతవరకూ ఇంటర్వ్యూల్లో చాలామందికి మినహాయింపు ఇచ్చేవారు. కొత్త విధానంలో అలా మినహాయింపు ఉండదు. గ్రీన్‌కార్డుల కోసం మరింత సమయం నిరీక్షించాల్సి రావచ్చు’ అని చెప్పారు. అమెరికాలో తాత్కాలిక వీసాపై పనిచేస్తున్నవారికే అధిక శాతం గ్రీన్‌కార్డులు దక్కుతున్నాయి. 2010 నుంచి 2014 మధ్య హెచ్–1బీ వీసాదారులు 2 లక్షల గ్రీన్‌కార్డులు పొందారని ‘బైపార్టిసన్ పాలసీ సెంటర్’ తెలిపింది. యూఎస్‌సీఐఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో దాదాపు 34,843 మంది భారతీయులు తాత్కాలిక వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారారు. ఇందులో 25,179మంది హెచ్–1బీ కేటగిరీలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారే.
హెచ్–1బీకి లెవల్ 1 జీతాలకు అంగీకరించం
హెచ్–1బీ దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలపై విచారణను యూఎస్‌సీఐఎస్ వేగవంతం చేసింది. హెచ్–1బీ వీసాదారులకు కంపెనీలు ఆఫర్ చేసిన లెవల్–1 వేతనాలు అంగీకరించమని హెచ్చరికలు వస్తున్నాయని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఖన్నా తెలిపారు. ‘ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కంపెనీలు లెవల్–1 వేతనాలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు లెవల్–4 కేటగిరీ వేతనాలు ఇస్తున్నాయి. శాన్ జోస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు(లెవల్ 1) 88,733 డాలర్ల(రూ. 56 లక్షలు) వేతనం ఉండగా, లెవల్ 4లో 1,55,147 డాలర్ల వేతనం ఆఫర్ చేస్తున్నారు.
ఆందోళనలో 8 లక్షల వలసదారులు
వలసదారుల్ని స్వదేశానికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయంపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయంపై దాదాపు లక్షల మంది వలసదారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చి తాత్కాలిక వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తున్న వీరంతా ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్నారు.
‘ చిన్నారులుగా ఉన్నప్పుడు దేశంలోకి అక్రమంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది భవిష్యత్తుపై మంగళవారం ట్రంప్ తన నిర్ణయం ప్రకటిస్తారు’అని వైట్‌హౌస్ పేర్కొంది. కాగా శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ.. ‘వీరిని స్వదేశాలకు పంపాలని ఒబామా హయాంలోనే డిమాండ్ చేయగా 2012లో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. డిఫెర్డ్ యాక్షన్ ఫర్ ఛైల్డ్‌హుడ్ అరైవల్స్ పేరిట అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు తాత్కాలిక వర్క్‌పర్మిట్లు జారీ చేశారు.