ఆత్మహత్యకు యత్నిస్తున్న కౌన్సిలర్‌ను అడ్డుకుంటున్న సభ్యులు
కామారెడ్డి టౌన్ : బల్దియాకు తన వార్డునుంచే ఎక్కువ ఆదాయం సమకూరుతున్నా.. సమస్యల పరిష్కారానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆవేదన చెందిన 32వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలు ప్రారంభం కాగానే నిధుల కేటాయింపులో తన వార్డుకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ 32 వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మతో వాగ్వాదానికి దిగారు.
32వ వార్డునుంచి బల్దియాకు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ. 2 కోట్ల వరకు నిధులు సమకూరాయని, కానీ వార్డులో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని పేర్కొన్నారు.కౌన్సిలర్లను సంప్రదించకుండానే ఎజెండాను ఇష్టానుసారంగా సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి సమావేశంలో ఆందోళన చేస్తున్నారని, ఇలాగైతే సభనుంచి సస్పెండ్ చేస్తామని చైర్‌పర్సన్ సుష్మ హెచ్చరించారు.
దీంతో కౌన్సిలర్ రామ్మోహన్ తన వెంట తెచ్చుకున్న బ్యాగులోనుంచి కిరోసిన్ బాటిల్ తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. ఇతర కౌన్సిలర్లు, అధికారులు అతడిని అడ్డుకుని కిరోసిన్ బాటిల్‌ను లాక్కుని హాల్ బయట పెట్టారు. రామ్మోహన్ మరోసారి బాటిల్ తీసుకుని, చైర్‌పర్సన్ వద్దకు వచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. సభ్యులు అడ్డుకుని బయటకు తీసుకువెళ్లి, శాంతింపజేశారు.
సమావేశం వాయిదా..
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యులతో చర్చించి సమావేశం తేదీని ఖరారు చేస్తామని చైర్‌పర్సన్ తెలిపారు.
కౌన్సిలర్‌పై కేసు నమోదు
కామారెడ్డిక్రైం: మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆత్మహత్యకు యత్నించిన కౌన్సిలర్ రామ్మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ ఫిర్యాదు మేరకు రామ్మోహన్‌పై ఆత్మహత్యాయత్నంతోపాటు సమావేశానికి అంతరాయం కలిగించడం, న్యూసెన్స్ చేయడం కేసులు నమోదు చేశామన్నారు.
పట్టించుకోవడం లేదు..
నా వార్డులో రూ.2 కోట్ల వరకు ఎల్‌ఆర్‌ఎస్ నిధులు వచ్చా యి. నిబంధనల ప్రకారం ఇందులో 50 శాతం నిధులు మా వార్డులో ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చైర్‌పర్సన్ దీనిని పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించా.
– రామ్మోహన్, 32వ వార్డు కౌన్సిలర్, కామారెడ్డి
అత్యధికంగా నిధులు కేటాయించాం..
32వ వార్డుకు అన్యాయం చేస్తున్నామన్నది వాస్తవం కాదు. పట్టణంలో అన్ని వార్డులకంటే 32వ వార్డుకే ఎక్కువ నిధులు కేటాయించాం. రూ. కోటికిపైగా నిధులిచ్చాం. అయినా ప్రతిసారి రామ్మోహన్ సమావేశాన్ని అడ్డుకుంటున్నారు.
– పిప్పిరి సుష్మ, మున్సిపల్ చైర్‌పర్సన్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment