మంచిర్యాలటౌన్/హాజీపూర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం ‘రెక్కలు’ పథకంలో ఏఎన్‌ఎంలకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో ఏఎన్‌ఎంలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగా లేక ఏఎన్‌ఎంలు సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఇక రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రోగుల వద్దకు చేరుకునేలా ప్రభుత్వం ఈ వాహనాలను అందించనుంది.
171 దరఖాస్తులు..
జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో 126 ఆరోగ్య ఉప కేం ద్రాలు ఉన్నాయి. మొత్తం 250 మంది ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. వీరిలో 98 మంది రెగ్యులర్ ఏఎన్‌ఎంలు కాగా, 108 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు, మిగతావారు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు రోజూ పీహెచ్‌సీల నుంచి సబ్ సెంటర్లకు, అక్కడి నుంచి గ్రామాలకు వెళ్లేందుకు రవాణా పరంగా ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం స్కూటీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జిల్లాలోని 171 మంది ఏఎన్‌ఎంలు స్కూటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుకు గడువు ముగిసినప్పటికీ మిగిలిన వారు ఆసక్తి చూపిస్తుండడంతో వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని కలెక్టర్‌కు పంపించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
రూ.13వేల వరకు సబ్సిడీ.. బ్యాంక్ లోన్
స్కూటీల కొనుగోలు కోసం ప్రభుత్వం ఏఎన్‌ఎంలకు నేరుగా రూ.10 వేల సబ్సిడీ అందించనుంది. అయితే కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ప్రభుత్వం అందించే రూ.10 వేల సబ్సిడీతో పాటు షోరూంల ద్వారా మరో రూ.3వేలు సబ్సిడీని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. అటు ప్రభుత్వం, ఇటు షోరూంల ద్వారా సబ్సిడీ అందితే స్కూటీ ధరలో దాదాపుగా 40 శాతం మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఏఎన్‌ఎంలకు స్కూటీలు ఇచ్చేందుకు సుజుకీ, యమహా, హీరో, హోండా, టీవీఎస్ కంపెనీలు ముందుకు రాగా, రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఏఎన్‌ఎంలు వారికి నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. సబ్సిడీ పోగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి నెలవారీ కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బుకింగ్ చేసుకునేందుకు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఐడీకార్డు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి.
మెరుగుపడనున్న వైద్యసేవలు
ప్రస్తుతం ఏఎన్‌ఎంలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు మారుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతూ విధుల నిర్వహణలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమయానికి వాహనాలకు అందుబాటులో లేక ఏఎన్‌ఎంలు పని చేయని సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు స్కూటీలు అందిస్తుండడంతో వారు సమయానికి గ్రామాలకు చేరుకుని వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం లక్షలాది రూపాయల నిధులను వెచ్చించి ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోంది. అయితే ఈ టీకాలు నిర్ణీత గడువులోగా వేయకపోతే ఇటు ఆరోగ్యపరంగా అటు ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలుగుతోంది. ఇక మీదట అలాంటి ఇబ్బందులు తప్పుతాయని అధికా రులు పేర్కొంటున్నారు.
సేవలు మెరుగవుతాయి..
జిల్లాలో పనిచేస్తున్న ఒక్కో ఏఎన్‌ఎం మూడు నుంచి నాలుగు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టే పథకాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంతకాలం ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని గ్రామాలను తిరిగేందుకు వారి కుటుంబ సభ్యుల సహకారమో లేదా ఆటోలనో ఆశ్రయించేవారు. స్కూటీలు అందించడం ద్వారా రవాణా సమస్యలు తీరనున్నాయి. సరైన సమయంలో గ్రామాలకు చేరుకుని వైద్యసేవలు అందిస్తారు.
– డాక్టర్ భీష్మ, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment