
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా మారిపోయాయి. వీటిలో చిక్కి వాహనదారులు ప్రమాదాలు, మరణాలకు గురవుతున్న నేపథ్యంలో రోడ్లను బాగు చేయాల్సిన ఆవశ్యకతపై నగర వాసులు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. నవ భారత డెమొక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఇందిరానగర్ వంద అడుగుల రోడ్డులో గుంతలు పడిన చోట ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్‌ల పోస్టర్‌లను అంటించి ప్రజలు ఆక్రోశం వెళ్లగక్కారు.
‘నేను మీ ముఖ్యమంత్రిని, ఈ గుంతలకు నేనే కారణమా?’, ‘నేను మీ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిని, గుంతలకు నేను కారణమా?’ అని వారిని ఎద్దేవా చేస్తున్నట్లు ఈ పోస్టర్లపై రాసి ఉంది. నగర పౌరులు ఈ పోస్టర్లను ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.