వివాదాలతోనే కలెక్షన్ల దుమ్మురేపింది
ఏదైనా సినిమా గురించి వివాదం వచ్చిందంటే.. అసలు అందులో ఏముందో చూద్దామని అంతా ఉత్సాహం చూపిస్తారు. సరిగ్గా అదే అంశం ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు బాగా కలిసొచ్చింది. కరణ్ జోహార్ తీసిన ఈ సినిమాలో పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో సినిమాను నిషేధించాలని, దాన్ని ప్రదర్శించడానికి వీల్లేదని తీవ్రస్థాయిలో గొడవలు చెలరేగాయి. ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్యవర్తిత్వం పుణ్యమాని సినిమా విడుదలైంది. దాంతో ఈ సినిమాకు బంపర్ కలెక్షన్లు వచ్చాయి. విడుదలైన మొదటిరోజున ఏకంగా రూ. 13.30 కోట్లు వసూలుచేసింది. రణబీర్ కపూర్, అనుష్కా శర్మ, ఐశ్వర్యా రాయ్ లాంటి పెద్ద స్టార్లు ఎంతమంది నటించినా, ఇందులో పాకిస్థానీ ఫవాద్ ఖాన్ ఉన్నాడన్న ప్రచారం మాత్రం బాగా జరిగింది. దాంతో బంపర్ కలెక్షన్లు వచ్చాయి.
మరోవైపు అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన శివాయ్ సినిమా కూడా దీని స్థాయిలో కాకపోయినా బాగానే వసూలుచేసింది. ఈ సినిమాకు రూ. 10.24 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఎరికా కార్, సయేషా సైగల్ నటించిన ఈ సినిమా చాలావరకు హిమాలయాల్లోనే ఉంటుంది. పర్వత ప్రాంత అందాలను అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్లు బాగానే ఉన్నాయి.