![Amitabh Bachchan Says He Enjoys When Aaradhya Want To Destroy His Working Desk - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/6/amitabh-bachchan.jpg.webp?itok=2JeX1Xtw)
‘పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆరాధ్య నా దగ్గరికి పరిగెత్తుకు వస్తుంది. పెన్ కావాలి.. ల్యాప్‌టాప్ కావాలి అంటూ బాగా విసుగు తెప్పిస్తుంది. పని మొత్తం చెడగొట్టాలని చూస్తుంది. ఇవన్నీ నాకు కోపం తెప్పించకపోగా ఎంతో సంతోషాన్నిస్తాయి. తన అల్లరి చేష్టలతో ఆరాధ్య నాకు తీపి ఙ్ఞాపకాలు మిగులుస్తుంది’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన మనుమరాలు ఆరాధ్యపై మమకారాన్ని చాటుకున్నారు. ఇటీవల ఓ షోకు హాజరైన ఆయన తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు.
అమితాబ్ మాట్లాడుతూ.. ‘ ఐశ్వర్య మా ఇంటికొచ్చాక ఏమీ మారలేదు. ఒక కూతురు(శ్వేతా నందా) పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. మరో కూతురు(ఐశ్వర్యా రాయ్) కోడలిగా ఇంట అడుగుపెట్టింది. ఇక నా మనుమళ్ల అల్లరి గురించి చెప్పక్కర్లేదు. వాళ్లను సగం చెడగొట్టేది నేనే. నవ్య నవేలి- అగస్త్య(శ్వేతా నందా సంతానం), ఆరాధ్య.. ఈ ముగ్గురిని సమంగా ప్రేమిస్తా. వాళ్లతో పాటు నేను కూడా చేరి అల్లరి చేస్తా. నేనుంటే వాళ్లకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ఎందుకంటే మేము కలిసి అల్లరి చేయాలంటే నాకు నా పిల్లల అనుమతి, వాళ్లకు తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేదు కదా’ అంటూ సరదాగా ముచ్చటించారు. కాగా ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌తో బిజీగా ఉన్న బిగ్ బీ ‘ఉయర్నద మనిదన్’ అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment