అందుకే ఈ సాహసం చేశా! : దర్శకుడు గుణశేఖర్
‘‘ఇది మన సినిమా అని తెలుగు వారందరూ గర్వపడేలా ఉంటుంది. నాకిలాంటి అవకాశమిచ్చిన గుణశేఖర్‌గారికి థ్యాంక్స్’’ అని అల్లు అర్జున్ అన్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ముఖ్య పాత్రల్లో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన చిత్రం ‘రుద్రమదేవి’. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ- ‘‘కమర్షియల్... ఆర్ట్.. ఏదైనా కావచ్చు..
ఏ సినిమా అయినా నాకిష్టమే. కరెక్ట్‌గా చెప్పాలంటే ‘మంచి సినిమాలు’ ఇష్టం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత మంచి సినిమా అందించడానికి తపించిన దర్శకుడు గుణశేఖర్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు చే యడం అనుష్కకే సాధ్యం. ‘అరుంధతి’ సినిమా తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేయగలనని నిరూపించుకున్నారు. ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడ్డారు. ఆమెలా ఎవరూ కష్టపడలేరు. ఇలాంటి జోనర్ మూవీస్ వస్తేనే ఇండస్ట్రీకి బాగుంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రాన్ని ఎంత పేషనేట్‌గా స్టార్ట్ చేశామో, అంతే ఉత్సాహంతో పూర్తి చేశాం. ఇది మా రెండున్నరేళ్ల కష్టం’’ అని అనుష్క అన్నారు.
రుద్రమదేవి కథే నాకు గుప్తనిధి - గుణశేఖర్
గుణశేఖర్ మాట్లాడుతూ- ‘‘కాకతీయుల చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా తీశాం. ప్రముఖ చరిత్రకారులను కలిసి, పరిశోధన చేశాం. అన్ని పుస్తకాల్లో చరిత్ర ఒకేలా లేదు. ఒక్కో పుస్తకంలో ఒక్కోలా ఉంది. అందుకే శిలా శాసనాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇంత అద్భుతమైన చరిత్రను రెండు గంటల 37 నిమిషాల్లో చెప్పడం సాహసంగా అనిపించింది. 800 ఏళ్ల క్రితం ఓ 40 ఏళ్ల పాటు ఓ స్త్రీ రాజ్యాన్ని ఎలా పాలించింది? దాని వెనకాల ఆమె చేసిన కృషి, త్యాగాలను చూసి స్ఫూర్తి పొందాను. రుద్రమ కథ అనే గుప్తనిధి నాకు దొరికింది.
అందుకే ఈ సాహసానికి పూనుకున్నాను’’ అని అన్నారు. రానా మాట్లాడుతూ- ‘‘చరిత్రను అద్భుతంగా చెప్పాలంటే సినిమా ప్రధాన సాధనం. నాకు చరిత్ర నేపథ్యంలో వచ్చే సినిమాలంటే చాలా ఇష్టం. 2005లో నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న సమయంలోనే గుణశేఖర్‌గారు నాకీ కథ చెప్పారు. ఈ సినిమాలో ఓ నటుడిగా నేనూ భాగం అయినందుకు సంతోషంగా ఉంది. రాణీ రుద్రమదేవి అంటే అనుష్క అనే విధంగా ముందు తరాలకు గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు.