సంక్రాంతికి లెజెండ్ తొలిచూపు
‘సింహా’ సినిమాలో కనిపించిన కొత్తదనం... బాలకృష్ణ అండర్ ప్లే. ప్రేక్షకులు బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నారో, ఆయన నుంచి ఎలాంటి పెర్‌ఫార్మెన్స్
‘సింహా’ సినిమాలో కనిపించిన కొత్తదనం... బాలకృష్ణ అండర్ ప్లే. ప్రేక్షకులు బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నారో, ఆయన నుంచి ఎలాంటి పెర్‌ఫార్మెన్స్ కోరుకుంటున్నారో ‘సింహ’లో ఆయన అలా కనిపించారు, ఆ విధంగా నటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన చిన్న మ్యాజిక్ అది. మళ్లీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తే, విజయం తధ్యమని వేరే చెప్పాలా? ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు బోయపాటి. ‘లెజెండ్’లో ప్రేక్షకులకు కొత్త బాలయ్యను చూపించబోతున్నారు. ఇందులో బాలయ్య పాత్ర చిత్రణ అత్యంత శక్తిమంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని సమాచారం. ఈ సంక్రాంతికి ‘లెజెండ్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర.
ఈ నెల 12 నుంచి ఈ చిత్రం షూటింగ్ నిర్విరామంగా హైరదాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. జనవరి 25 వరకూ ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రం టాకీ దాదాపుగా పూర్తవుతుందని సమాచారం. ఫిబ్రవరిలో రెండు పాటల్ని, ఒక యాక్షన్ ఎపిసోడ్‌ని, కొన్ని కీలక సన్నివేశాలను ఫారిన్‌లో చిత్రీకరిస్తారు. మళ్లీ హైదరాబాద్‌లో జరిపే పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. రాధికా ఆప్టే, సోనాలీ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.