
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 22వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ గురించి ప్రజలకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. మేం తీయబోయే ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాలో వాటిని చూపిస్తాం. ఎన్టీఆర్ పేరు పేదవారి హృదయ స్పందన. భూమి మీద ఎందరో పుడతారు..గిడతారు. కానీ అందరూ మహానుభావులు కాలేరు. మాటలు కాకుండా చేతల్లో చేసి చూపి తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేసిన మహానుభావుడు.
ఎన్టీఆర్ అంటే...
ఎన్టీఆర్‌లో ఎన్ అంటే ఆయన ఇల్లే నటనాలయం ఆయనే నటరాజు. టీ అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రారాజు రాజకీయ దురందరుడు. రమణీయ రమ్య సుందరుడు. ఆలోచనే కాదు... అప్పటివరకూ అమల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి. మహిళలకు ప్రత్యేక యూనివర్శిటీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. భౌతికంగా ఎన్టీఆర్ మనమధ్యలో లేకపోయినా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నటుడిగా ఆయన బిడ్డగా తర్వలోనే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నాం. ఆయనలో బయటకి తెలియని ఎన్నో కోణాలున్నాయి. వాటన్నింటినీ ఈ సినిమాలో చూపిస్తాం. తెలుగు మహాసభల్లో నా ధర్మంగా నేను అన్నగారిని గుర్తు చేశా. ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేస్తున్నాం.’ అని అన్నారు.
యుగపురుషుడు...మహానుభావుడు
ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే యుగాలు చాలవని, తరాలు తీరవని ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ..‘తెలుగు భాష, జాతి ఉన్నంతకాలం ప్రతి ఇంటా మహానుభావుడు జీవించి ఉంటాడు. మే 28 ఆయన జయంతి. ఆరోజు ప్రతీ ఇంట పండుగ. ఇక జనవరి 18 ఆయన మరణం ఒక దు:ఖ దినం. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫామ్స్. ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా పేర్లు మార్చి పథకాలు తెస్తున్నారు. కానీ అవి అన్ని అన్నగారు ప్రారంభించినవే.
బాపూజీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు ఇలా అందరి ఆశయాలు కలగలిపితే ఎన్టీఆర్. త్రిలింగదేశమైన తెలుగుజాతి ఒక రాష్ట్రంగా ఉండాలని ప్రాణ త్యాగం చేసి రాష్ట్రం సాధించింది పొట్టి శ్రీరాములు. అయితే రాష్ట్రం సాధించినా మదరాసీలుగా గుర్తించబడుతున్నామని తెలుగు వారి సత్తాను దశదిశలా చాటింటి ఎన్టీఆర్. ఆయన కడుపున పుట్టడమే మహాద్భాగ్యం. ఆయనకు భారతరత్న కోసం అందరూ కలిసి కృషి చేయాలి. తెలుగువారు ఉన్నంతకాలం ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారు. ఆయనను తెలుగు మహాసభల్లో తలచుకోలేదంటే ఇక మేమం ఏం చేయలేం.’ అని అన్నారు. కాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం హరికృష్ణ, బాలకృష్ణ,కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు... ఎన్టీ రామారావుకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్‌లుక్
కాగా ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం ఉదయం విడుదల చేసింది. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నారు. బాలకృష్ణ, కొర్రపాటి సాయి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’కు కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.