
జీవితాంతం నాతో ఉంటాడనుకున్నా..!
‘‘నా మనసు నిండా జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అవి ఎప్పటికీ ప్రశ్నలగానే మిగిలిపోతాయని నాకు తెలుసు. ఒక్కోసారి జీవితం అంటే భయమేస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం. అది కాసేపే. నా భర్త, పిల్లలను చూడగానే ఆ భయం పోతుంది’’ అంటున్నారు జుహీ చావ్లా. ఆమె అంత ఉద్వేగంగా మాట్లాడటానికి కారణం ఉంది. దాదాపు నాలుగేళ్లుగా కోమాలో ఉన్న జుహీ అన్నయ్య బాబీ చావ్లా గత ఆదివారం తుది శ్వాస విడిచారు. సోదరుడి మరణాన్ని అంత తేలికగా తీసుకోలేకపోతున్నారు జుహీ. ఈ సందర్భంగా తన మనోభావాలను వ్యక్తపరుస్తూ -‘‘నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు కొండంత అండగా నిలిచేది మా అమ్మ.
నా పెళ్లయిన ఏడాదికి తను చనిపోయింది. అప్పుడు ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు నాన్నగారు అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా అన్నయ్య బాబీ చావ్లా నాకన్నా ఎనిమిదేళ్లు పెద్ద. చిన్నప్పుడు మేమిద్దరం బాగా గొడవపడేవాళ్లం. నన్ను తోసేవాడు. అమాంతం కిందపడిపోయేదాన్ని. అప్పుడు బాబీ మీద నాకు బాగా కోపం వచ్చేది. పెద్దయిన తర్వాత మా ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అమ్మ చనిపోయిన తర్వాత బాబీ నా అండ అయ్యాడు. జీవితాంతం తను నాకు అండగా ఉంటాడనుకున్నా. కానీ, మధ్యలోనే వదిలేశాడు. నా జీవిత భాగస్వామి జై ఇప్పుడు నాకు పెద్ద అండ. తను, నేను, మా ఇద్దరి పిల్లలు... ఇప్పుడు నా జీవితం ఇదే. అమ్మ, నాన్న పోయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు అన్నయ్య కూడా దూరం కావడంతో ఆ ఆలోచనలను ఎక్కువయ్యాయి. అలాగని, నా భర్త, పిల్లల పట్ల నా బాధ్యతను విస్మరించను. వాళ్లు లేని జీవితాన్ని ఊహించలేను’’ అంటూ జుహీ చావ్లా కన్నీటి పర్యంతమయ్యారు.