వారిద్దరిలో ఎవరు ఓకే అన్నా తెలుగులో సినిమా చేస్తా! | I will do movie in telugu if any one of those two agree | Sakshi
Sakshi News home page

వారిద్దరిలో ఎవరు ఓకే అన్నా తెలుగులో సినిమా చేస్తా!

Published Wed, Mar 12 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

వారిద్దరిలో ఎవరు ఓకే అన్నా తెలుగులో సినిమా చేస్తా!

వారిద్దరిలో ఎవరు ఓకే అన్నా తెలుగులో సినిమా చేస్తా!

గజని, స్టాలిన్, తుపాకి... ఈ సినిమాలు చాలు దర్శకునిగా మురుగదాస్ ప్రతిభ ఏంటో చెప్పడానికి. నిర్మాతగా కూడా విజయబాటలో నడుస్తున్నారాయన. తమిళంలో మురుగదాస్ నిర్మించిన ‘రాజా-రాణి’ తెలుగులో అదే పేరుతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటిస్తూ అనేక విషయాలు చెప్పారాయన.
 
 ‘రాజా-రాణి’ ఏ తరహా చిత్రం?
  ‘ప్రేమ విఫలమైనా కృంగిపోనవసరం లేదు. జీవితం చాలా పెద్దది’ అనే పాయింట్ నాకు నచ్చి ఈ సినిమా నిర్మించాను. ఇందులోని హార్ట్ టచింగ్ సీన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాలోనూ చూసుండరు.కథ అంతగా నచ్చినప్పుడు రీమేక్ చేయొచ్చుకదా! డబ్బింగ్ చేయడానికి కారణం?
 ఈ కథను రీమేక్ చేస్తే ఫీల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే డబ్బింగ్ చేస్తున్నాం. నయనతార, ఆర్యలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది కదా. ఇక బాధేముంది?  
 
 దర్శకునిగా భారీ సినిమాలు, నిర్మాతగా మాత్రం చిన్న సినిమాలు. కారణమేంటి?
 స్టార్లతో సినిమాలు చేయడం రిస్క్ అని చాలామంది అభిప్రాయం. నన్నడిగితే మాత్రం అదే శ్రేయస్కరం అంటాను. ఎందుకంటే... స్టార్లకు మార్కెట్ ఉంటుంది. కాస్త బాగా తీస్తే మన డబ్బుల్ని మనం రాబట్టుకోవచ్చు. కానీ చిన్న సినిమాలు అలాకాదు. అందులో నటించేవారందరూ దాదాపు కొత్తవాళ్లే అయ్యుంటారు. వాళ్లపై మూడు నాలుగు కోట్లు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడమంటే, మరీ రిస్క్. వాళ్లు ఎలా తీస్తారో తెలీదు. ఏ రకంగా చూసినా చిన్న చిత్రాలు ప్రమాదకరమే. అందుకే ఇకనుంచి తెలుగు, తమిళ భాషల్లో భారీ సినిమాలనే చేయాలనుకుంటున్నాను.


 అసలు నిర్మాణంలోకి రావాలని మీకెందుకనిపించింది?
 డబ్బు సంపాదన కోసం నేను నిర్మాత కాలేదు. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడానికి నిర్మాతనయ్యాను. హిందీ ‘గజనీ’ తర్వాత ఫాక్స్‌స్టార్ స్టూడియోవారు నా దర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నారు. నాకున్న కమిట్‌మెంట్స్ వల్ల అది సాధ్యపడలేదు. అయితే... కొత్తవారిని ప్రోత్సహిస్తూ చిత్ర నిర్మాణం చేపడితే బావుంటుందనే నా ఆలోచనను వారి ముందుంచాను. వారికి నచ్చింది. దాంతో నేను, వారు కలిసి నిర్మాణాన్ని మొదలుపెట్టాం.


 ‘స్టాలిన్’ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తారు?
 త్వరలోనే. ఆ సినిమా ద్వారా తెలుగు స్టార్‌ని తమిళ చిత్రరంగానికి కూడా పరిచయం చేయాలనే ఆలోచన ఉంది. సదరు హీరో మార్కెట్, నా మార్కెట్‌లకు తగ్గట్టుగా ఆ సినిమా బడ్జెట్ ఉంటుంది. నాలుగువేల థియేటర్లలో ఆ సినిమాను విడుదల చేస్తే బావుంటుందనుకుంటున్నా. వచ్చే ఏడాది ఈ సినిమా ఉంటుంది.

 మీ దృష్టిలో ఉన్న ఆ తెలుగు హీరో ఎవరు?
 మహేశ్‌బాబు. ‘గజని’ సినిమాను ఆయన హీరోగా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఆయనతో పాటు రామ్‌చరణ్‌కి కూడా ఈ కథ చెబుతాను. ఎవరు ఓకే అంటే వారే హీరో. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సామాజిక అంశాలు కూడా ఉంటాయి.
 
 దర్శకునిగా మీ బాలీవుడ్ ప్రస్థానం ఎలా ఉంది?
 చాలా బాగుంది. నిజానికి ‘తుపాకి’ కథను ముందు బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా చేద్దాం అనుకున్నాను. ఆయన డేట్స్ లేక అప్పుడు కుదర్లేదు. కానీ... ఇప్పుడు అక్షయ్‌తోనే ‘తుపాకి’ రీమేక్ చేస్తున్నాను. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తాం.
 
 ప్రేమ సన్నివేశాలను చాలా రొమాంటిక్‌గా, కొత్తగా తీస్తారు. స్వీయానుభవమా?
 (నవ్వుతూ...) అలాంటిదేం లేదు. నిజానికి నిజజీవితంలో నాకు అలాంటి అనుభవాల్లేవు. అలాంటి అనుభవాలుంటే... తీసే ప్రతి సినిమాలోనూ ఒకేలాంటి సన్నివేశాలుంటాయి. లేవు కాబట్టే కొత్తగా ఉంటున్నాయి.
 
 దేశం మొత్తం అభిమానించే దర్శకునిగా ఎదిగారు. ఈ అనుభూతి ఎలా ఉంది?

 కెమెరాను నేనేమీ కనిపెట్టలేదు కదా. గర్వంగా ఫీలవ్వడానికి. నేనిక్కడ సాధించింది ఏమీ లేదు. సినిమా అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాకు మంచి పేరు తెచ్చింది. ‘రమణ’ తీస్తున్నప్పుడు తమిళంలో మంచి పేరొస్తే చాలనుకున్నాను. ‘గజని’ దేశం గుర్తించేలా చేసింది. ఇదంతా దైవనిర్ణయం.


 డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా?
 హిచ్‌కాక్, స్పీల్‌బర్గ్ తరహాలో థ్రిల్లర్స్, ఫాంటసీ సినిమాలు చేయాలని ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement