ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ చేద్దామంటున్నాడు | Junior NTR wants to make sequel of Adurs movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ చేద్దామంటున్నాడు

Published Wed, Oct 9 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ చేద్దామంటున్నాడు

ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ చేద్దామంటున్నాడు

ఈ తరంలో మాస్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు వీవీ వినాయక్. 11 ఏళ్లలో 12 సినిమాలు డెరైక్ట్ చేసిన వినాయక్ కెరీర్‌లో అత్యధిక శాతం విజయాలే ఉన్నాయి. వివాదాలకు దూరంగా... విజయాలకు సమీపంగా ఉండే వినాయక్ ప్రస్తుతం నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు. నేడు ఆయన పుట్టిన్రోజు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, ఇతర విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు.
 
‘నాయక్’ సినిమా తర్వాత విరామం ఎక్కువ తీసుకున్నట్లున్నారు?
అలా అని నేను అనుకోవడం లేదు. ‘నాయక్’ తర్వాత నేను ‘ఓకే’ చేసిన సినిమా బెల్లంకొండ సురేష్‌గారి అబ్బాయి సాయిగణేష్‌ది. ఒక కొత్త హీరోని పరిచయం చేసే బాధ్యత తలపై వేసుకున్నప్పుడు కథ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు అనుకున్న కొన్ని కథలు నాకంత తృప్తికరంగా అనిపించలేదు. సరైన కథ కుదిరాకే సెట్స్‌కెళ్లాలనేది నా అభిమతం. అలాంటి కథ కోసమే ఇన్నాళ్లూ ఆగాను. ఇప్పుడు నవరసాలు ఉన్న కథ కుదిరింది. ఈ నెలలోనే సెట్స్‌కి వెళుతున్నాం. 
 
 ***  సాయిగణేష్‌ని హీరోని చేయడానికి మీరు ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలేంటి? 
 దర్శకత్వం నా వృత్తి. అయితే.. ఈ సినిమాకు పనిచేయడాన్ని వృత్తిగానే నేను భావించడం లేదు. ఇది నా బాధ్యత. బెల్లకొండ సురేష్ రుణం తీర్చుకోడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం ఇది. తొలి సినిమాను ఏ దర్శకుడూ కంఫర్ట్‌గా ఫీలవ్వలేడు. కానీ నేను ఫీలయ్యాను. ఏ టెన్షన్ లేకుండా ఈజీగా ‘ఆది’ సినిమా చేయగలిగాను. దానికి కారణం బెల్లంకొండ సురేష్. ఈ రోజు ఆయన కారణంగా మా కుటుంబం హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆయన కొడుకుని హీరోని చేసే బాధ్యత నాపై పడింది. అందుకే ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. సాయి ఒక నిర్మాత కొడుకులా పెరగలేదు. హీరో అవ్వాలనే కసితో పెరిగాడు. అతనిలోని ఎనర్జీ స్థాయిని రేపు తెరపై చూస్తారు. యాక్షన్, లవ్, కామెడీ, మ్యూజిక్.. ఇలా అన్నీ మేళవించిన సినిమా ఇది. బాధ్యతాయుతమైన పాత్రను ఇందులో సాయి చేస్తున్నాడు. సమంత కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ నెలలోనే పాటతో షూటింగ్ మొదలు పెడతా. 
 
 ***  మాస్ సినిమాల దర్శకుడైన మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?
 చిన్నప్పట్నుంచీ యాక్షన్ సినిమాలు చూడ్డం ఇష్టం. దర్శకునిగా యాక్షన్ సినిమా తీయడం ఇష్టం. అలాగని యాక్షన్‌కే పరిమితం కాను. మణిరత్నం సినిమాలను కూడా ఇష్టపడతా. 
 
 ***  మరి మీ నుంచి అలాంటి సినిమాలు ఎందుకు రావు? 
 ఇలాంటి సినిమాలే తీయాలని నేను దర్శకుణ్ణి కాలేదు. యాక్షన్ సినిమాలు కూడా నేను అనుకుని చేస్తున్నవి కాదు. నా జీవితంలో అన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే. అయితే... నాక్కూడా ఒక మంచి ప్రేమకథ తీయాలని ఉంది. త్వరలో అంతా కొత్తవారితో ఓ ప్రేమకథ తీస్తా. 
 
 ***  భవిష్యత్తులో మీ నుంచి ప్రయోగాలు కూడా ఆశించొచ్చా?
 ప్రయోగాలంటే నాకు  భయం. నాపై నమ్మకంతో కోట్ల రూపాయలు వెచ్చించే నిర్మాతల్ని ఇబ్బందుల్లో పెట్టలేను. 
 
 ***  మీలాంటి పెద్ద దర్శకుల నుంచి చిన్న సినిమాలు కూడా వస్తే బాగుంటుంది కదా?
 ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్లన్నీ నా సొంత ప్రొడక్షన్స్ లాంటివి. బెల్లకొండ సురేష్, దిల్‌రాజు, నల్లమలుపు బుజ్జి వీళ్ల సినిమాలతోనే సరిపోతుంది నాకు. ఇక చిన్న సినిమాలు తీయడానికి టైమ్ ఎక్కడిది? అయితే... ఈ మధ్య చెన్నయ్ వెళ్లినప్పుడు అక్కడ పోస్టర్లు చూస్తే... అన్నీ చిన్న సినిమాలే కనిపించాయి. కొత్తవారితో చిన్న సినిమాలు తీసే దర్శకులు అక్కడ చాలామంది ఉన్నారు. మా తరంలో మేం తీయలేకపోయినా... వచ్చే తరం కచ్చితంగా చిన్న సినిమాలకు పెద్ద పీట వేస్తుందని నా నమ్మకం. 
 
 ***  ఇతర భాషల్లో సినిమాలు ఎప్పుడు చేస్తారు? 
 బాలీవుడ్‌లో చేసే అవకాశం వచ్చింది. బిజీ వల్ల చేయలేకపోయా. భవిష్యత్తులో చేస్తానేమో. 
 
 ***  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసింది. నిజమేనా?
 పచ్చి అబద్దం. కొడాలి నాని మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ కారణంగా నేను కూడా రాజకీయాల్లోకి వెళతాననే టాక్ వచ్చింది. 
 
 ***  చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో చేశారు. మరి నాగార్జునతో ఎప్పుడు చేస్తారు?
 నాగార్జునగారితో ఎప్పుడో చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. నాకూ అందరు హీరోలతో చేయాలని ఉంది. త్వరలో చేస్తా. 
 
 ***  మళ్లీ తారక్‌తో సినిమా ఎప్పుడు?
 ఈ సినిమా అవ్వనీయండి. తర్వాత చెబుతా. 
 
 ***  మీ సినిమాల్లో సీక్వెల్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు?
 తారక్ ఆ మధ్య అన్నాడు ‘అదుర్స్’ సీక్వెల్స్ చేస్తే బాగుంటుందని. చూద్దాం!
 
 ***  చిరంజీవి 150వ సినిమాకు మీరే దర్శకుడని టాక్. నిజమేనా?
 ఇప్పుడాయనకు సినిమా చేసే మూడ్ లేదు. 
 
 ***  మీరు సున్నిత మనస్కులట. సినిమా విషయంలో ఫలితం తేడాగా వస్తే ఫీలైపోతారట. నిజమేనా?
 అంత సున్నితంగా ఉండటం కరెక్ట్ కాదని మా నాన్న అంటూ ఉండేవారు. నా నైజం అది. 
 
 ***  కెరీర్‌లో ఎప్పుడైనా వెలితిగా ఫీలైన సందర్భాలున్నాయా?
 కలలో కూడా ఊహించనంత గొప్ప జీవితాన్ని నాకు దేవుడిచ్చాడు. ఇప్పుడున్న ఈ స్థితిని చూసి ఎప్పుడూ ఆనందిస్తుంటా. ఇక వెలితి ఎందుకుంటుంది?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement