![kerala heavy rains in tollywood industry donates - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/19/Maa-%2812%29111_0.jpg.webp?itok=Rxmp9qWg)
బెనర్జీ, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరావు, హేమ....
కేరళలో వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు వల్ల కుదేలైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. కేరళ సాయానికి సంబంధించి శనివారం సాయంత్రం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. కేరళ ప్రజలకు తమ వంతు సాయంగా 10లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు. ‘‘హీరోల మద్దతు లేకుండా ఏమీ చేయలేం.
‘మా’కు హీరోలే వెన్నెముక. చిరంజీవి కుటుంబం స్పందించడం ఆనందంగా ఉంది’’ అని శివాజీరాజా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. చిరంజీవి కుటుంబం దాదాపు 61 లక్షల (చిరంజీవి 25, రామ్‌చరణ్ 25, చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పదిలక్షల రూపాయల మందులు) రూపాయలను కేరళకు సాయంగా ప్రకటించినట్లుగా పేర్కొంది. కేరళకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ‘మేము సైతం’ అంటూ బాగా సహాయం అందుతోందని చెప్పొచ్చు. మహేశ్‌బాబు 25 లక్షలు, అల్లు అర్జున్ 25లక్షలు, సూర్య–కార్తీ 25 లక్షలు, నయనతార 10 లక్షలు, రామ్ 5 లక్షలు, విజయ్ దేవరకొండ 5లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరితో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు విరాళాలు అందజేయడం జరుగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment