'సుల్తాన్‌'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్‌! | No Salman, SRK clash at the box office, Raees postponed to 2017 | Sakshi
Sakshi News home page

'సుల్తాన్‌'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్‌!

Published Wed, May 4 2016 4:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

'సుల్తాన్‌'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్‌!

'సుల్తాన్‌'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్‌!

బాలీవుడ్ సూపర్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్, షారుఖ్‌ ఖాన్ సినిమాలంటే బాక్సాఫీస్‌ వద్ద ఉండే సందడే వేరు. అదే ఆ ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకేసారి తమ సినిమాల్ని విడుదల చేస్తే.. ఆ పోటీ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. అభిమానుల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. అలాంటి అతిపెద్ద పోరు ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది.

ఈ ఏడాది దీపావళి పండుగ సమయంలో షారుఖ్‌ 'రాయిస్‌', సల్మాన్‌ 'సుల్తాన్‌' ఒకేసారి వస్తాయని ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఖరారు చేశారు. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ షేక్ చేస్తుందని భావించిన ఓ  పోటాపోటీ నుంచి షారుఖ్ అనూహ్యంగా తప్పుకున్నాడు. షారుఖ్ 'రాయిస్‌'ను వచ్చే ఏడాది విడుదల చేస్తామని తాజా చిత్ర దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

ఎందుకిలా.. కారణమేమిటి?
భారీ అంచనాలు రేకెత్తిన బాక్సాఫీసు మహాపోరు నుంచి షారుఖ్‌ ఎందుకు తప్పుకున్నాడంటే.. అందుకే ఆయన తాజా చిత్రం 'ఫ్యాన్‌' ఘోర పరాభవమే కారణమని వినిపిస్తోంది. నిజానికి బాక్సాఫీసు పోరు నుంచి ఆయన గతంలో ఎప్పుడు తప్పుకొని పారిపోలేదు. 2009లో ఓం శాంతి ఓ వర్సెస్ సావరియా, 2012లో జబ్ తక్ హై జాన్‌ వర్సెస్ సన్ ఆఫ్ సర్దార్, 2015లో బాజీరావు మస్తానీ వర్సెస్ దిల్‌వాలే వంటి హోరాహోరీ పోరులోనూ షారుఖ్ విజేతగా నిలిచాడు.

నిజానికి 2015 ఆగస్టులో ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయని తెలిసినప్పుడు షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పండుగ సందర్భంగా ఎవరి సినిమాలు వారు విడుదల చేస్తారని, ఇందులో భయపడాల్సిందేమీ లేదని, నిజానికి తమ సినిమా పండుగ సందర్భంలో విడుదల చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ తో పోటీకి భయపడే ప్రసక్తే లేదని పరోక్షంగా కుండబద్దలు కొట్టాడు.

కానీ 'ఫ్యాన్' ఘోర పరాభవం 'రాయిస్‌' సినిమా విషయంలో షారుఖ్ బిగ్ యూటర్న్ తీసుకున్నాడు. భారీ అంచనాలతో విడుదలై, మంచి రివ్యూలు తెచ్చుకున్నా.. 'ఫ్యాన్' సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరలేకపోయింది. 'ఫ్యాన్‌' చేదు ఫలితం ప్రభావమే 'రాయిస్‌' చిత్ర తేదీని మార్చేలా షారుఖ్‌ను, చిత్ర నిర్మాతలను పూరికొల్పి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ సినిమాను పండుగ రేసు నుంచి తప్పించి 2017 జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించామని 'రాయిస్‌' నిర్మాతలు రితేశ్ సిద్వాని, ఫర్హాన్ అఖ్తర్, హీరో షారుఖ్‌ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement