ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..! | Raai Laxmi replaces Catherine Tresa in Chiranjeevis Khaidi No 150 | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..!

Published Thu, Oct 13 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..!

ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..!

ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరూ చెప్పలేరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అంతే. కథ, నటీనటులు, టెక్నీషియన్లు.. అనూహ్యంగా మారుతుంటారు. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, విశాల్ కొత్త సినిమాలోనూ ఇటువంటి మార్పులే చోటు చేసుకున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ నుంచి కేథరిన్, విశాల్ సినిమా నుంచి రకుల్ ప్రీత్‌సింగ్ బయటకు వచ్చేయగా.. వాళ్ల ప్లేస్సుల్లోకి రాయ్ లక్ష్మి, అనూ ఇమ్మాన్యుయేల్ ఎంటరయ్యారు.
 
అప్పుడు తమ్ముడితో.. ఇప్పుడు అన్నయ్యతో..!

పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ‘తప్పు తప్పే.. శుద్ధ తప్పే’ పాటలో డ్యాన్స్ చేసిన రాయ్ లక్ష్మి, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’లో ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేస్తున్నారు. మొదట ఈ పాటలో నటించే అవకాశం ఇటీవల ‘సరైనోడు’లో ఓ హీరోయిన్‌గా నటించిన కేథరిన్‌కు దక్కింది. చిరంజీవి, కేథరిన్‌లపై ఓ రోజు షూటింగ్ కూడా చేశారట. కానీ, హఠాత్తుగా సీన్లోకి రాయ్ లక్ష్మి వచ్చేశారు. ఈ మార్పుకి కారణం చిత్ర బృందానికే ఎరుక. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రకథానాయకుడు చిరంజీవి, రాయ్‌లక్ష్మి పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి రాఘవా లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
రకుల్ బిజీ.. అనూ రెడీ..!

మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్న సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మూడేళ్ల విరామం తర్వాత కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రకుల్ కూడా రెడీ అన్నారు. అయితే.. విశాల్ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే సమయానికి, రకుల్ తెలుగులో బాగా బిజీ అయ్యారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘ధృవ’, మహేశ్‌బాబు-ఏఆర్ మురుగదాస్ సినిమాల్లో నటిస్తున్నారామె. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లోనూ రకులే హీరోయిన్. తెలుగులో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రకుల్‌కు, విశాల్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదట.

చేసేదేం లేక చిత్రబృందం మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ను సంప్రదించారట. ఇటీవల చెన్నై వెళ్లిన అనూ.. కథ, అందులో తన క్యారెక్టర్ గురించి దర్శకుడితో డిస్కస్ చేశారట. కథ, ఆమె పాత్ర బాగా నచ్చడంతో విశాల్ సరసన నటించడానికి వెంటనే అంగీకరించారని సమాచారం. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడం ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకీ.. ఈ అనూ ఇమ్మాన్యుయేల్ ఎవరనుకున్నారు? ఇటీవల విడుదలైన నాని ‘మజ్ను’లో మెయిన్ హీరోయిన్‌గా నటించారు. గోపీచంద్ ‘ఆక్సిజన్’లోనూ తనే హీరోయిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement