'ఆ సినిమాపై హోంమంత్రి వందశాతం భరోసా'
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ సినిమా విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు గురువారం రాజ్ నాథ్ ను కలిశారు.
భేటీ ముగిసిన తర్వాత మహేశ్ భట్ విలేకరులతో మాట్లాడుతూ... హోంమంత్రి తమకు వందశాతం భరోసాయిచ్చారని తెలిపారు. 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అడ్డంకులు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరాతానని తమతో రాజ్ నాథ్ చెప్పినట్టు వెల్లడించారు. సినిమా విడుదలవుతున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తానని హామీయిచ్చినట్టు చెప్పారు. ఈ సినిమా చూడొద్దనుకున్న వారిని తాము బలవంతం చేయడం లేదని, అలాగే సినిమా చూసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం సరికాదని మహేశ్ భట్ అన్నారు.
మన సినిమాలు, టీవీ కార్యక్రమాలను పాకిస్థాన్ అడ్డుకోవడం పెద్ద విషయం కాదన్నారు. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంటాయని, పాకిస్థాన్ లో విడుదల చేయకున్నా పెద్దగా నష్టం ఉండదని వివరించారు. కరణ్ జోహార్ తెరకెక్కించిన 'ఏ దిల్ హై ముష్కిల్'లో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే.