నలుగురు హీరోలు.. నాలుగు నెలల్లో పూర్తి!
నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన చిత్రమిది. క్యారెక్టర్ బాగా నచ్చడంతోనే ఈ సినిమా చేశా. నలుగురు హీరోలను ఒక తాటి మీదకు తీసుకొచ్చారు ఆనంద్ ప్రసాద్‌గారు.
‘బాణం, సోలో’ చిత్రాల తర్వాత మణిశర్మ సంగీతంలో చేశాను’’ అన్నారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చాలా కొత్తగా ఉండే కథ ఇది. ఈ చిత్రంలో తల్లిని కోల్పోయిన కొడుకు పాత్ర చేశా. నలుగురు హీరోలతో సినిమా చేయడం ఇబ్బంది అనుకుంటున్న ఈ తరుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘనత ‘శమంతకమణి’ టీమ్‌ది’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘కార్తిక్ అనే లవబుల్ పాత్ర చేశా. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదరడంతో నాలుగు నెలల్లోనే పూర్తి చేయగలిగాం’’ అన్నారు ఆది.
‘‘శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ కథతో ఈ సినిమా తీశారు. ఈ మల్టీస్టారర్ అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. జూలై 14న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలూ నాకు చాలా సపోర్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్, సుమన్, తనికెళ్ల భరణి, మణిశర్మ వంటి సీనియర్లతో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇంద్రజ, చాందినీ చౌదరి, అనన్యా సోని, జెన్ని తదితరులు నటించిన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ.