'హత్తుకున్నాక.. 4 రోజులు స్నానం చేయలేదు'
బెంగళూరు: జీవితంలో తాను సాధించిన విజయాలు, పేరు ప్రతిష్ఠలు తన తండ్రి, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్కు అంకిత మిస్తున్నట్టు ఆయన కుమారుడు శివరాజ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, బెంగళూరులో నిర్వహించిన బెళ్లి హెజ్జి కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ దంపతులకు నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. అనంతరం శివరాజక్ కుమార్ తన జీవితంలోని కొన్ని సంగతులను మీడియాతో పంచుకున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నానని, ఆయనే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. .
ఆయన తన నటజీవితంలో చిన్నా, పెద్దా నటులందరితోనూ కలిసి పనిచేశారని ఈ స్టార్ హీరో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శంకర్ నాగ్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్ అందరితో నటించారన్నారు. తాను కూడా భవిష్యత్తులో కన్నడ సినీ పరిశ్రమలో హీరోలందరితోనూ నటించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు.
తాను చిన్నప్పటినుంచి స్టార్ కొడుకుగా కాకుండా సాధారణ పిల్లాడిలా పెరిగానని చెప్పుకొచ్చారు. కాలేజీకి బస్ లో వెళ్లేవాడినన్నారు. తాను సినిమాల్లోకి రాకుండా ఉండి వుంటే మంచి క్రికెటర్ అయి వుండేవాడినని తెలిపారు. కాలేజీలో చదువుకునే సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడిననీ, దాన్ని అలా కొనసాగించి ఉండి ఉంటే దేశం కోసం మంచి క్రికెటర్గా మిగలేవాడినన్నారు. కానీ విధి మరోలా ఉండి యాక్టింగ్ స్కూలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనొక ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమని చెప్పారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు.
కాగా ఇప్పటికే 100 సినిమాల మార్క్ ను దాటి విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న శివరాజ్ కుమార్, యువహీరో సందీప్తో కలిసి 'కుంభ మేళా'లో నటించనున్నారు. దీంతోపాటు సోదరుడు, మరో టాప్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.