బాలీ హామీలు | Special story on indian biopics movie | Sakshi
Sakshi News home page

బాలీ హామీలు

Published Tue, Jan 8 2019 12:06 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Special story on indian biopics movie - Sakshi

రాజకీయం ప్రజల కోసం ఉండాలి. ప్రజల కోసం.. ప్రజలచేత..  ప్రజల వలన సాగాలి. రాజకీయం ప్రజలను ఒక్కటి చేయాలి. రాజకీయం ప్రేమను,  శాంతిని పెంపొందించాలి. ఇవన్నీ రాజకీయాలకైతే ఓకే.  కానీ బాలీవుడ్‌ రాజకీయాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి వాడుకుంటుంది. ఎలా అయితేనేమి ఎలా చెబితేనేమి ప్రజలకు అర్థమయ్యేలా చెబితే చాలు. సినిమాను మించిన మెస్సేజ్‌ ఉండదేమో! ప్రస్తుత రాజకీయాలను, రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్‌ తెచ్చిన కొన్ని చిత్రాలపై విశ్లేషణ

రాజకీయాలు, సినిమాలు  ఆర్‌ ది మోస్ట్‌ సేలబుల్‌ సబ్జెక్ట్స్‌   ఎంటర్‌టైన్‌మెంట్‌ మార్కెట్‌లో. ఈ రెండూ కలిస్తే చెప్పేదేముంది బంపర్‌ బొనాంన్జే!  2018 సంవత్సరాంతంలో  అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  ఈ సందర్భంగా  సినిమాతో రాజకీయాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో కావల్సినంత వినోదాన్ని పంచారు. క్రియేటివిటీకి ఓ న్యూవేవ్‌ వేశారు ఉత్సాహవంతులు. హిట్‌ అయిన తెలుగు, హిందీ సినిమాల్లోని  హీరో, విలన్‌లకు అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ నేతల మొహాలను పెట్టి సృజన తృష్ణతోపాటు విజయకాంక్షనూ తీర్చుకున్నారు. ఇటు సోషల్‌ మీడియా ఆడియెన్సూ వాటికి విపరీతంగా వ్యూస్‌ ఇచ్చి, షేర్స్‌ పెంచి బ్లాక్‌బస్టర్స్‌ను చేశారు. ఆ ట్రెండ్‌ ఈ యేడు జరగబోయే అసెంబ్లీ,  లోక్‌సభ ఎన్నికలకూ స్ట్రెచ్‌ అయ్యే దృశ్యం కనపడుతోంది. అయితే  ఒకరినొకరు తిట్టుకోవడం..మార్ఫింగ్‌ చేసుకోవడం నేలబారు పోకడ. కొత్త ప్లాన్‌ ఏంటంటే..  కొన్ని బాలీవుడ్‌  సినిమాల థీమ్‌ను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా.. వాగ్దానాలుగా  మలచుకోవడం!  మల్టీప్లెక్స్, సింగిల్, స్మాల్, వెబ్‌ స్క్రీన్‌(అన్ని వర్గాల) ఓటర్లనూ ఆకర్షించి  కమర్షియల్‌ హిట్‌ లాంటి ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేయడం. అలాంటి సినిమాల ప్రస్తావనతో ఓ చిన్న పొలిటికల్‌ మూవీ క్రియేటివ్‌ ఎక్సర్‌సైజ్‌... 

పీప్లీ లైవ్‌..
ఇది రైతు కథ. కాలంలేక, పంటలు పండక, పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు పీప్లీ ఊళ్లోని ఓ రైతు. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుంది ప్రభుత్వం. అందుకని ఆ డబ్బుకోసం ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. 
ఎజెండా: ఇప్పటికే దేశంలో చాలా చోట్ల రైతులకు రుణమాఫీ, మద్దతు ధర వంటి పథకాలను అందచేస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.  మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల రైతుల ఇటీవలి ర్యాలీనీ విస్మరించకూడదు.  అన్నం పెట్టే రైతు రుణాల్లో మునగకుండా  చూడాలి.   

టాయ్‌లెట్‌..
మహిళల బహిర్భూమి సమస్యతో తెరకెక్కిన సినిమా. కనీస అవసరాల్లో ఇంట్లో టాయ్‌లెట్‌ ముఖ్యమైనది. దాని కోసం పోరాటం చేసి, సాధించిన ఓ కోడలి కథ. 
ఎజెండా: స్వచ్ఛభారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ టాయ్‌లెట్‌ అనే నినాదంతో ఇప్పటికే వీటి నిర్మాణాన్ని చేపట్టింది.  అయినా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లే లేవు ఇక  టాయ్‌లెట్లు ఎక్కడ ఉంటాయి?  చెరువులు, కాల్వల గట్లే ప్రత్యక్ష ఉదాహరణలు. టాయ్‌లెట్‌ ఉన్న ఇల్లు అంటే ఆడపడచుకి గౌరవమిచ్చే ఇల్లు అని. ఆ క్రెడిట్‌ ప్రాంతీయ పార్టీల ఖాతాలోనూ చేరాలి. 

ఓ మై గాడ్‌.. 
దేవుడికి, నాస్తికుడికి మధ్య ఉన్న భక్తివిశ్వాసాల సారం ఈ చిత్రం. విశ్వంలో జరిగే ప్రతి కర్మ, క్రియకు  కర్త ఆ భగవంతుడే. సర్వమత సారాంశం ఇదే. ఈ సినిమా చర్చా దీని మీదే. 
ఎజెండా: దేవుడు ఉంటే అందరికీ ఉంటాడు. లేకపోతే ఎవరికీ లేడు. ఉన్నాడనేదే మెజారిటీ నమ్మకం. కనుక ఆడ,మగ, కుల,వర్గ భేదం లేకుండా ఏ గుడిలోకైనా అందరికీ ప్రవేశం కావాలి. దేవుడితో రాజకీయాలు వద్దు. దేవుడి జన్మస్థానం పేరుతో మత యుద్ధాలు వద్దు. హేతుబద్దమైన ఆలోచనాతీరును పెంపొందించే  విద్యావిధానానికి శ్రీకారం చుట్టాలి. అత్యున్నత న్యాయస్థానాల తీర్పును గౌరవించే వాతావరణాన్ని కల్పించాలి. 

రాజ్‌నీతి
మహాభారత కథకు ఆధునిక రూపం ఈ సినిమా. కుటుంబ పాలన, అధికారం కోసం రక్తసంబంధీకుల మధ్య కలహాలు, మైనారిటీ ఓట్లకోసం ఆరాటం, ఆధిపత్య పోరాటమే ఈ మూవీ స్టోరీ. 
ఎజెండా: ప్రజాస్వామ్యం అంటే అధికారం ప్రజలకు బంటు అనే కదా! ఈ నమూనా కుటుంబ పాలనకు ఫక్తు వ్యతిరేకం. మైనారిటీ సంక్షేమం వాళ్ల ఓటు బ్యాంకులో మురగొద్దు. వాళ్ల అభివృదై్ధ  కనపడాలి.

మసాన్‌..
సమాజంలో అన్ని రకాల దోపిడీకి గురవుతున్న వర్గాల కథ. బడుగు, బలహీనుల మీద దాడులు కూడదని చూపించే చిత్రం. 
ఎజెండా: కులాల మధ్య అంతరాలు పోవాలని, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలూ సమాజంలో 
గౌరవ మర్యాదలు అందుకోవాలనే రిజర్వేషన్స్‌ కల్పించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను తెచ్చింది. కాని పురోగమించాల్సిన మనం తిరోగమనానికి సిద్ధపడ్డాం. దేశంలో దళితులపై దమనకాండలు పరువు హత్యల పేరుతో రూపం మార్చుకున్నాయి.  చట్టాలను కాలరాస్తున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. బడుగు, బలహీనులకు అండగా ఉన్న 
చట్టాలను పరిరక్షించే ప్రయత్నం చేయాలి. 

అయ్యారీ..

రక్షణశాఖలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన సినిమా ఇది. దేశానికి కంచెగా ఉన్న డిఫెన్స్‌  మినిస్ట్రేయే డబ్బుకి ఆశపడి ప్రజల రక్షణను లంచానికి పణంగా పెట్టే కహానీ అయ్యారీ. 
ఎజెండా: ఓటు అంటే నమ్మకం. గెలుపు అంటే బాధ్యత. ఈ రెండిటినీ సమన్వయం చేసుకునేదే అధికారం. ప్రజల మంచిచెడులకు బాధ్యత వహించడానికి ముందుకు వస్తున్న పార్టీలు  ఈ అంశాన్ని విస్మరించకూడదు. దేశ రక్షణకు సంబంధించి గతంలో జరిగినవి, ఇప్పుడు దుమారంలో ఉన్న డిఫెన్స్‌ డీల్స్‌
 కుంభకోణాలు  కావనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలి. వారి భద్రతకు తామే కాపలా అన్న భరోసానివ్వాలి. 

రాజీ..
‘అయ్యారీ’కి విరుద్ధమైన కథే రాజీ. దేశం కోసం సొంత కూతురి జీవితాన్నే బలిగా పెట్టిన ఓ గూఢచారి కథ. 
ఎజెండా: జాతీయవాదం అంటే మతం పేరుతో దేశంలోని ప్రజలను విడగొట్టడంకాదు. మతానికి అతీతంగా దేశం కోసం నిలబడ్డం. ప్రజల మధ్య ఐకమత్యాన్ని చాటడం. అంతర్గత భద్రత లేకుండా సరిహద్దు రక్షణ ఎలా సాధ్యం? ‘రాజీ’ని ఇలా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను ఎజెండాలో భాగం చేసుకోవాలి. కార్యాచరణకు అడుగులు వేయాలి. 

పింక్‌..
‘‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. ఆడవారి మాటలకే అర్థాలే వేరులే’’ అన్న ఈ పాదం తప్పు. ‘నో’ అంటే ‘నో’ అనే. దానికి ఇంకా వేరే అర్థాలేం లేవు. ‘వద్దు’ అనే స్ట్రయిట్‌ మీనింగే. పింక్‌ సినిమా చెప్పేదీ ఇదే. స్త్రీలను గౌరవించమని. ఇష్టంలేదు అని ఆమె అంటే వినమని. ఆ మాటకు విలువివ్వమని. 
ఎజెండా: ఆకాశంలో సగం మాట దేవుడెరుగు దేశంలో సగం జనాభా ఉన్న మహిళలకు ఎక్కడా సమాన హక్కులు లేవు. అవకాశాలు అంతకన్నా లేవు.  రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్‌ చర్చల్లో వినిపిస్తోంది తప్ప బిల్లుగా కనిపించట్లేదు. ఉద్యోగాల్లో  అన్నిరకాల వేధింపులే బోనస్‌.  కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు పుట్టకుండా కుట్రలు నూరుతున్నారు. భూమ్మీదున్న వాళ్లనైతే  రకరకాల అవమానాలతో చంపేస్తున్నారు. చట్టాలు చేసి ఊరుకోవడం కాదు.. అమలు జరిగేలా, అతిక్రమణ లేకుండా చూడాలి. ప్రతి పార్టీ  ప్రాక్టికల్‌ ఎజెండాలో మహిళ భాగం కావాలి. అప్పుడే ఆమె అభివృద్ధిలో అర్ధభాగంగా,  ఉత్పాదక శక్తిగా సముచిత స్థానం పొందుతుంది. 

రోటీ.. కపడా.. ఔర్‌ మకాన్‌..
ఎప్పటిదో ఈ  సినిమా. ఇప్పటికీ ఈ మూడు ఉన్న జనాభా చాలా తక్కువ మన దేశంలో. 
ఎజెండా: ఎన్నిటినో సాధిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్లడానికీ బడ్జెట్‌ను కూడబెడ్తున్నారు. కాని కూడు, గుడ్డ, గూడుకే కరువు చూపిస్తున్నారు. ఈ కనీస అవసరాలను సమకూర్చుకోలేకపోతున్నాం. ఈసారైనా వీటిని సంపూర్ణంగా సాధిస్తే మిగిలిన పురోభివృద్ధిలో ప్రజలూ పార్ట్‌నర్స్‌ అవుతారు. 

న్యూటన్‌..
నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే ఓ ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. 
ఎజెండా: పైనవన్నీ సాధించాలన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తి సజావుగా సాగాలన్నా  ఎన్నికలు సక్రమంగా జరగాలి. బ్యాలెట్‌ బాక్స్‌లు ఉంటే రిగ్గింగు జరిగే అవకాశం ఎక్కువని ఈవీఎంలకు వెళ్లాం. ఈవీఎంలనూ ట్యాంపర్‌ చేయొచ్చనే వాదనా వినపడుతోంది. అందుకని ప్రతి పార్టీ తమ ఎజెండాల్లో ముందుగా పోలింగ్‌లో అవినీతికి పాల్పడమనే స్వీయవాగ్దానం చేసుకోవాలి. 
– సరస్వతి రమ(ది ఎకనమిక్‌ టైమ్స్‌ సౌజన్యంతో..) 

బయోపిక్స్‌
సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి నేతలుగా మారిన వాళ్ల లైఫ్‌ బయోపిక్స్‌గా వస్తున్నాయి . అలాగే జన నేతలుగా పేరుగాంచిన నాయకుల జీవితాలుకూడా  సినిమాలుగా  తెరకెక్కాయి.  అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మన్‌ మోహన్‌ సింగ్, ఎన్‌.టి.ఆర్, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి బయోపిక్స్‌ ఇందుకు ఉదాహరణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement