బన్నీకి వైజాగ్, మరి మహేష్కు?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ను ఫాలో అయితే సినిమా మంచి విజయం సాధిస్తుందని వారి నమ్మకం. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకూ ఇందుకు అతీతులు కాదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే అల్లు అర్జున్కు 'వైజాగ్' సెంటిమెంట్ ఉంది. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సన్నివేశాన్ని అయినా విశాఖ బీచ్లో తీస్తే మంచి హిట్ వస్తుందని నమ్ముతాడు. వైజాగ్ సెంటిమెంట్ కూడా బన్నీకి వర్క్ అవుట్ అయ్యింది.
ఇక మహేష్ తన ప్రతి చిత్రం విడుదలకు ముందు అజ్మీర్ దర్గాను సందర్శించుకోవటం ఆనవాయితీ. ఇటీవల విడుదలైన 'ఆగడు' కు ముందు కూడా మహేష్ ఈ దర్గాను సందర్శించుకున్నాడు. అలాగే తన చిత్రాలకు మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ను కూడా ఈ మిల్కీబాయ్ విశ్వసిస్తాడు. మంచు విష్ణు కూడా సినిమా టైటిల్ 'డి'తో మొదలయ్యేలా చూసుకుంటాడు. మెగాస్టార్ చిరంజీవికి కూడా వైట్ ప్యాంట్ సెంటిమెంట్ ఉంది. ఆయన తన చిత్రంలో కనీసం ఒక పాటలో అయినా వైట్ ప్యాంట్తో కనిపిస్తే ఆ సినిమా హిట్ అయినట్లే.
ఇక నిర్మాతలు, దర్శకుల విషయానికి వస్తే సినిమా అయ్యేవరకూ ఒకరు గడ్డం తీయకపోతే, మరొకరు సినిమా విడుదలకు ముందు వెంకన్నకు తలనీలాలు అర్పించటం ఆనవాయితీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాను దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు తన గడ్డం, మీసాన్ని కూడా ట్రిమ్ చేయరట. షూటింగ్ అయ్యాక తిరుమల వెంకన్న దర్శనం చేసుకుని గడ్డం తీస్తారట.
పూరీ జగన్నాథ్ కూడా సెంట్మెంట్ను ఫాలో అవుతాడు. తన సినిమా స్టోరీలు రాసుకునేందుకు అతడు ఏకంగా బ్యాంకాక్ వెళ్లటం విశేషం. వినటానికి విడ్డూరంగా ఉన్నా అక్కడైతే మంచి ఆలోచనలు వస్తాయని అందుకే బ్యాంకాక్ వెళతానని పూరీ చెప్పటం విశేషం. దర్శకుడు శ్రీను వైట్లకు కూడా సింహాచలం అప్పన్న సెంటిమెంట్ ఉంది. తన ప్రతిసినిమా విడుదలకు ముందు సింహాచలం దర్శించుకోవటం ఆనవాయితీ అని శ్రీను వైట్ల తెలిపాడు. దర్శకుడు వీఎన్ ఆదిత్య తన సినిమా పూర్తయ్యాక పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల ఆలయాన్ని దర్శించుకుని గుండు చేయించుకోవటం తెలిసిందే.
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫేవరెట్ పుణ్యక్షేత్రం తిరుమల. తన ప్రతి సినిమా ఆడియో విడుదలకు ముందు తప్పనిసరిగా వెంకన్నను దర్శించుకుంటాడు. తన తొలి సినిమా నుంచి ఇదే అనుసరించే అతడు సినిమా విడుదలైన తర్వాత రోజు స్వామివారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకుంటాడు. ఇక అగ్ర నిర్మాత రామానాయుడుకి తన సినిమా తొలి కాపీని వెంకటేశ్వరుని పాదాల చెంత ఉంచటం ఆనవాయితీ.
దిల్ సినిమాతో దిల్ను ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత దిల్ రాజు కూడా సినిమా విడుదలయ్యే ముందురోజు వెంకన్నను దర్శించుకుని గుండు చేయించుకుంటాడు. అలాగే బెల్లంకొండ సురేష్ కూడా జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.