ఉత్తరప్రదేశ్‌లో విషాదం
► యమునా నదిలో పడవ మునిగి 19 మంది మృతి
► బాగ్పట్ జిల్లాలో ప్రమాద ఘటన
బాగ్పట్: యమునా నదిలో పడవ మునిగి 19 మంది మరణించిన విషాద ఘటన గురువారం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి ప్రయాణికు లతో వెళ్తున్న పడవ బాగ్పట్ జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలోని కాఠా గ్రామ సమీపంలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 60 మంది వరకూ ప్రయాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ భవానీ సింగ్ చెప్పారు.
పడవ మునిగిన కాఠా గ్రామ సమీపంలో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 20 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. 15 మందిని రక్షించారు. మొత్తం 22 మంది మరణించారని తొలుత ప్రకటించినా.. అనంతరం ఆ సంఖ్యను అధికారులు 19కి తగ్గించారు. ‘ మొదట 22 మంది మరణించారని భావించాం. అయితే మృతదేహాల మేరకు 19 మంది మరణించారని నిర్ధారించాం’ అని కలెక్టర్ సింగ్ చెప్పారు. ఈ సంఘటన అనంతరం స్థానికులు కోపంతో రెండు వాహనాలకు నిప్పుపెట్టారని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.