
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: ఖుష్బూ
డీఎంకేను వదిలిపెట్టి దాదాపు ఆరునెలలు గడిచిన తర్వాత ఎట్టకేలకు నటి ఖుష్బూ తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ విషయం వెల్లడించారు.
డీఎంకేను వదిలిపెట్టి దాదాపు ఆరునెలలు గడిచిన తర్వాత ఎట్టకేలకు నటి ఖుష్బూ తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ విషయం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆమె చేరుతారని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. విశేష ప్రజాదరణ ఉన్న ఖుష్బూ లాంటి వాళ్లు చేరడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రధానంగా జీకే వాసన్ వెళ్లిపోయిన సమయంలో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలకు ఇది మంచి ఊతం ఇస్తుందని నాయకులు అంటున్నారు.
పెళ్లికి ముందే సెక్స్ లాంటి అంశాల గురించి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా ప్రచారం పొందిన ఖుష్బూ.. డీఎంకే నాయకత్వంపై అసంతృప్తితో జూన్ 16న ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2010లో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆ పార్టీలో చేరారు. మధ్యలో ఆమె బీజేపీలో చేరుతారన్న కథనాలు వినిపించినా, వాటిని ఖండించారు.