సీఎం మాటల మనిషే.. చేతల మనిషి కాదు: బీజేపీ
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఆమె మంత్రులు వివిధ ప్రాజెక్టుల పేరుతో ఖజానాను ఖాళీ చేశారని చెబుతున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. అవినీతి గురించి కేవలం కబుర్లు చెబుతున్నారు తప్ప దాన్ని అరికట్టేందుకు ఏమీ చేయడం లేదని బీజేపీ విమర్శించింది. ముఖ్యమంత్రి నిజంగానే అవినీతిపై గట్టిగా వ్యవహరించాలని అనుకుంటే, అవినీతిపరులైన మాజీ మంత్రులపై చర్యలు తీసుకునేవారని.. కానీ నాటి లోకాయుక్త జస్టిస్ ఎన్‌కే మెహ్రోత్రా గట్టిగా చెప్పినా బీఎస్పీ మంత్రులపై ఎలాంటి చర్యలు లేవని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ అన్నారు.
అవినీతి విషయంలో సమాజ్‌వాదీ, బీఎస్పీల మధ్య రహస్య అవగాహన ఉందని, అందువల్లే ముఖ్యమంత్రి కేవలం మాటలు చెప్పి ఊరుకుంటున్నారు తప్ప చేతల జోలికి పోవడం లేదని ఆయన ఆరోపించారు. 'నువ్వు నన్ను రక్షిస్తే నేను నిన్ను రక్షిస్తా' అని ఇద్దరూ ఊరుకుంటున్నారని చెప్పారు. బీఎస్పీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని, దాని సంగతి ఏమైందని కూడా పాఠక్ ప్రశ్నించారు.