
అనైతిక రాజకీయాలపై అన్ని కోణాల్లో యుద్ధం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ
♦ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం
♦ అన్ని పార్టీల నేతలను కలుస్తాం... మద్దతు కూడగడతాం
♦ న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తాం
♦ ఫిరాయింపులపై చర్యలు తీసుకొనే అధికారాన్ని ఈసీకి అప్పగించాలి
♦ ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో ప్రతిపక్ష నేత భేటీ
♦ అనైతిక రాజకీయాలకు పార్టీ ఫిరాయింపులే పరాకాష్ట: డి.రాజా
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అనైతిక రాజకీయాలపై అన్ని కోణాల్లో యుద్ధం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం ఢిల్లీలో సీపీఐ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజాతో సమావేశమైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... దేశంలో కొనసాగుతున్న అనైతిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంలో భాగంగా అన్ని పార్టీల నేతలను కలసి మద్దతు కూడగడుతున్నామని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకొనే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, ఎన్నికల సంఘానికి అప్పగిస్తేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తీసుకొచ్చే దిశగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నామని చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని పార్టీల నేతలను కలవడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రయత్నంలో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పు కోసం కోర్టులను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించారు.
పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తాం: డి.రాజా
అనైతిక రాజకీయాలకు పార్టీ ఫిరాయింపులే పరాకాష్ట అని డి.రాజా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన అంశమని చెప్పారు. తనతో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘పార్టీ నుంచి నిష్ర్కమిస్తే.. ఆ పార్టీ ద్వారా సమకూరిన శాసనసభ్యత్వంతో సహ అన్ని పదవులను కోల్పోయినట్లే. కానీ, ఏపీలో అలా జరగడం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకొని అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అనైతిక వ్యవహారాలు ప్రజల ఆకాంక్షలకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్యానికే సవాళ్లు విసురుతున్నాయి.
ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాలని వైఎస్ జగన్ మాకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు మే 28-29న జరగనున్నాయి. కార్యదర్శి వర్గ సమావేశం త్వరలో ఉంది. జగన్ లేవనెత్తిన అంశాలను, చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తాం. చంద్రబాబు రూ. 1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ఇచ్చిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై కూడా పార్టీ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తాం. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి సీపీఐ మద్దతు ఉంటుంది’’ అని డి.రాజా పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఢిల్లీకి రావాల్సి ఉన్నా.. ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల రాలేకపోయారని చెప్పారు.
జగన్ కుటుంబంతో పరిచయం ఉంది
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి పరిచయం ఉందని డి.రాజా తెలిపారు. ఏపీలో సీట్ల సర్దుబాటు విషయంలో రాజశేఖరరెడ్డితో చర్చలు జరిపే అవకాశం తనకు వచ్చిందని గుర్తు చేశారు. జగన్ మాతృమూర్తి విజయమ్మతోనూ తాను మాట్లాడానని అన్నారు. అలా వారి కుటుంబంతో తనకు ముందు నుంచే పరిచయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీపీఐ నేతలు అమర్జీత్ కౌర్, అనీ రాజా పాల్గొన్నారు.